న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘానికి మకిలి అంటింది. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి అప్రజాస్వామిక నిర్ణయాలతో రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును కూడా నిర్దాక్షిణ్యంగా చోరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే తోటి కమిషనర్ల విశ్వాసాన్ని కోల్పోయిన భారత ప్రధాన ఎన్నికల కమిషర్ జ్ఞానేశ్ కుమార్‌ను విపక్షాలు, ఒక వర్గం ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నికలను పర్యవేక్షించే వ్యవస్థ ఎంతమాత్రం ఇకపై ఆయన చేతుల్లో ఉండరాదని వారు గట్టిగా కోరుకుంటున్నారు.
తక్షణం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుతున్నట్టు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసినా, అది ఎన్నికల సంఘం స్వతంత్రతను పునరుద్ధరించ లేదు. ఈసీకి అంటిన మకిలి తొలగిపోదు. దీనికేం చేయాలంటే.. ఎన్నికల సంఘం తక్షణం ‘సర్’ను నిలిపివేయాలి. దానికి సంబంధించిన అన్ని అంతర్గత రికార్డులను వెల్లడించాలి. నియోజకవర్గ స్థాయి చేర్పులు, తొలగింపులు, స్వతంత్ర న్యాయ, పార్లమెంటరీ విచారణ, నిజమైన కార్యనిర్వాహక-యేతర నియామక యంత్రాంగాన్ని పునరుద్ధరించడం, వంటి చర్యలు చేపట్టాలి. అప్పుడే ఎన్నికల సంఘం ప్రక్షాళన అవుతుంది. ప్రజలకు దీనిపై మళ్లీ విశ్వాసం ఏర్పడుతుంది. ఈ దిద్దుబాట్లు చేయకపోతే భారత దేశంలో ఒక నిరంకుశ పాలకుడు మధ్యవర్తిని ఎన్నుకుని, నియమాలు రూపొందించి ఫలితాన్ని ప్రజాస్వామ్యమని ప్రకటించమని పౌరులను కోరే వ్యవస్థ మాత్రమే ఉంటుంది.
సీఈసీ తొలగింపు అంత సులభం కాదు..
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఒక పక్క డిమాండ్ చేస్తూనే మరో పక్క ఆయన అభిశంసన కోరుతూ విపక్షాలు ఉభయ సభల్లోనూ నోటీసులు అందజేయడానికి సిద్ధపడుతున్నాయి. అయితే సీఈసీని తొలగించడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అత్యంత క్లిష్టమైన రాజ్యాంగపరమైన కార్యాలలో ఒకటి. రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. అందులోని క్లాజ్ 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కూడా పదవీకాల భద్రతను కల్పిస్తున్నది. ఆర్టికల్ 124(4) ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు ఒకే సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వుల మేరకు మాత్రమే సీఈసీని పదవి నుంచి తొలగించవచ్చు.
ఈ తీర్మానం ఆమో దం పొందాలంటే ప్రతి సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీతో పాటు హాజరై ఓటు వేసిన సభ్యులలో మూడింట రెండు వంతులతో కూడిన ప్రత్యేక మెజారిటీ అవసరం. సీఈసీ అసమర్ధత, దుష్ప్రవర్తన రుజువైతే మాత్రమే ఆయనను పదవిలోంచి తొలగించడానికి రాజ్యాంగం అనుమతిస్తుంది. పార్లమెంట్లో సీఈసీపై అభిశంసన పెట్టాలంటే కనీసం 100 మంది లోక్‌సభ, 50 మంది రాజ్యసభ సభ్యులు ఆ తీర్మానంపై సంతకం పెట్టి ప్రిసైడింగ్ అధికారికి సమర్పించాలి. ఆ తీర్మానాన్ని అంగీకరించడానికి, లేదా తిరస్కరించడానికి స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు పూర్తి అధికారం ఉంది. ఒకే రోజు రాజ్యసభ, లోక్‌సభల్లో నోటీసులు సమర్పిస్తే స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు వాటిని తప్పక అంగీకరించి విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి. ముగ్గురు సభ్యుల ఆ కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లేదా ప్రధాన న్యాయమూర్తి, లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ లేదా ఒక విశిష్ట న్యాయవేత్త ఉండాలి.
సీజేపీ హెచ్చరికలతో ఈసీ అలర్ట్
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోని అర్హులైన పౌరుల నమోదును సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం ఈ నెల 27న ఢిల్లీ వ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ అల్టిమేటం ఇవ్వడం, సీఈసీని దేశ ద్రోహిగా పేర్కొంటూ ఆయన అభిశంసనకు విపక్షాలు సిద్ధమవుతున్న క్రమంలో ఎన్నికల సంఘం హఠాత్తుగా ఈ చర్య చేపట్టింది. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేనివారికి మరో అవకాశం కల్పించేందుకు ఈ శిబిరాలను ఢిల్లీ అంతటా నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా ఈనె 27న యువ ఓటర్ల నమోదుకు కళాశాలలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
‘మా మధ్య విభేదాలు లేవు.. అవన్నీ ఏకగ్రీవ నిర్ణయాలే..’
ఎన్నికల సంఘంలో తీవ్ర విభేదాలున్నాయని, పలు కీలక నిర్ణయాల్లో సీఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఎట్టకేలకు ఈసీ స్పందించింది. ‘సర్’ సహా కీలక నిర్ణయాలన్నీ పూర్తి కమిషన్ ఏకగ్రీవంగా తీసుకున్నదని ఈసీఐ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పాయింట్-టు-పాయింట్ వివరణ జారీ చేసింది. సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు శనివారం ముగ్గురు సభ్యులతో సమావేశం నిర్వహించింది. ముగ్గురు కమిషనర్ల ఆమోదంతోనే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిపింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదర్‌లో సమావేశమైనట్టు ఆ పత్రికా ప్రకటన వెల్లడించింది. సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ మీడియాలో కథనాలు రావడంతో వారు ముగ్గురూ సమావేశమయ్యారని తెలుపుతూ వారు ముగ్గురూ కూర్చుని ఉన్న ఫొటోను విడుదల చేసింది. ఐటీ విభాగంలో పని పునః పంపిణీ, పశ్చిమ బెంగాల్లో సర్‌పై అభ్యంతరాలు, గోవాలో ఓటర్ల నిర్వహణలో ఈసీ అనుసరించిన విధానం, కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6లో చేసిన మార్పులు, ఆన్లైన్ వ్యవస్థ ఈసీఐనెట్ పనితీరు ఇలా అనేక అంశాల్లో సీఈసీకి, ఇతర కమిషనర్లకు విభేదాలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ అంతర్గత విభేదాలు ప్రజాస్వామ్యయుత పనితీరులో భాగమేనని సమర్థించుకుంది. పరోక్షంగా విభేదాలు నిజమేనని అంగీకరించింది.