హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి, బీటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈసెట్-2025 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తంగా 93.87% విద్యార్థులు క్వాలిఫై అయ్యా రు. ఈ నెల 12న ఆన్లైన్లో పరీక్ష నిర్వహించగా.. 18వేలకు పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 17వేలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 విభాగాలకు పరీక్షలు నిర్వహించారు.
ఈ ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు సత్తాచాటారు. అమ్మాయిలు 95.81%, అబ్బాయిలు 92.71% క్వాలిఫై అయ్యారు. పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్ ర్యాంకు ఆధారంగా బీటెక్ సెకండియర్లో (ల్యాట్రల్ ఎంట్రీ) ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కౌన్సెలింగ్ జూన్ 15 తర్వాత ప్రారంభంకానున్నది. ఇంజినీరింగ్ కాలేజీల్లో పలు బ్రాంచీల్లో మొత్తం 25 వేల సీట్లున్నా యి. ఇవేకాకుండా ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ తర్వాత బీటెక్ ఫస్టియర్లో సీట్లు మిగిలితే, అవి సెకండియర్లో ఖాళీగా ఉంటాయి. మిగిలిన సీట్లను సైతం ఈసెట్ ద్వారానే భర్తీచేస్తారు. క్వాలిఫై అయిన అందరికీ సీట్లు దక్కనున్నాయి.