న్యూఢిల్లీ : మెరుగైన ఆహారంతో బాధించే మలబద్ధకాన్ని నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో పాటు తగినంత శారీరక వ్యాయామంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, ఓట్స్‌తో కూడిన ఆహారం నిత్యం తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.
ఈ ఆహారం గ్యాస్ట్రిక్ వ్యవస్ధను నియంత్రిస్తూ ప్రేవులను బలంగా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసేందుకు రోజూ తగినంత నీరు తీసుకుంటే జీవక్రియల వేగం పెరుగుతుంది. ఇది ఆహారం జీర్ణమయ్యేందుకు తోడ్పడటమే కాకుండా మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది.
పెరుగు, మజ్జిగ వంటి ప్రొబయాటిక్స్ అధికంగా తీసుకోవడం మేలు. ఈ ఆహారం తరచూ తీసుకోవడంతో పాటు కాఫీ, టీలను తగ్గించాలి. ఇవి ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే కెఫిన్ డీహైడ్రేషన్‌కు దారితీసి అవయవాలపై ఒత్తిడి పెంచుతుంది. జీర్ణ సమస్యలు, గ్యాస్ పేరుకుపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.