హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని హింగోలి -నాందేడ్ రీజియన్లో గురువారం తెల్లవారుజామున 1.40 గంటలకు స్వల్పంగా భూప్రకంపనలు సంభవించాయి. ఈ క్రమంలో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు చెప్పారు. తదనంతరం వరుసగా మూడుసార్లు భూమి కంపించిందని, రిక్టర్ సేలుపై 3.6, 3.9, 4.1గా నమోదయినట్టు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. స్వల్పంగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.