వికారాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : భూభారతి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వారం రోజులుగా సర్వ ర్ మొరాయిస్తుండడంతో భూముల రిజిస్ట్రేషన్లతోపాటు భూభారతి దరఖాస్తుల పరిష్కారం జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. అలాగే, పెండింగ్ అప్లికేషన్లూ పెరిగిపోతున్నాయి. దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో రైతులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేయడంతోపాటు స్థానిక రెవె న్యూ అధికారులకూ విజ్ఞప్తులు చేస్తున్నారు.
ప్రధానంగా కలెక్టర్, తహసీల్దార్ల లాగిన్లలో అధిక సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల 26న కలెక్టర్‌గా దీపక్ తివారీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు భూభారతి దరఖాస్తుల పరిష్కారం షురూ చేయకపోవడంతో కలెక్టర్ లాగిన్‌లో పెండిం గ్ దరఖాస్తులు పెరిగాయి. మరోవైపు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ రైతులు ఇబ్బంది పడుతున్నా రు. పెళ్లిళ్లు, అనారోగ్య పరిస్థితులు, ఇతర అత్యవసరాల నిమిత్తం భూ ములను విక్రయించాలనుకున్న రైతులు గత వారం రోజులుగా సర్వర్ డౌన్ సమస్యతో తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
గతంలో రోజుకు జిల్లాలోని 20 మండలాల్లో 150-200 వరకు రిజిస్ట్రేషన్లు కాగా, సర్వర్ డౌన్ సమస్యతో గతవారం రోజులుగా జిల్లాలో 50 రిజిస్ట్రేషన్లు కూడా కావడం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌పై లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చినప్పటి నుంచి తరచూ సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లతోపాటు భూసమస్యల పరిష్కారానికి రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
పెండింగ్‌లోనే వేల దరఖాస్తులు..
జిల్లాలో గత వారం, పది రోజులుగా భూభారతి పోర్టల్‌లో సర్వర్ డౌన్‌తో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ప్రతి సోమవారం ప్రజావాణిలో విన్నవించడంతోపాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పెండింగ్‌లో ఉన్న భూభారతి దరఖాస్తుల్లో అధికంగా టీఎం-33(డేటా కరెక్షన్), ప్రొహిబిటెడ్ అప్లికేషన్లే ఉన్నాయి. టీఎం-33 అనంతరం ఆర్ఎస్ఆర్ సమస్యతో మ్యుటేషన్, సక్సెషన్ తదితర ఏ మ్యాడ్యూల్లో దరఖాస్తు చేసుకున్నా పరిష్కరించేందుకు వీలులేకపోవడంతో వాటిని తిరస్కరిస్తున్నారు. ఆర్ఎస్ఆర్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
ప్రతి గ్రామంలోనూ ఆర్ఎస్ఆర్ సమస్య ఉండడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఉన్న భూమి కంటే ఎక్కువ లేదా తక్కువ భూమి ఉన్నట్లుగా ధరణి ఆపరేటర్లు ఎంట్రీ చేయడంతో ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమైంది. రైతుల పేరిట ఎక్కువ భూమి ఉన్నట్లు ఆన్లైన్లో ఎంట్రీ కావడంతో గుర్తించడం కష్టంగా మారడంతోపాటు సంబంధిత రైతులు సహకరించకపోవడంతో కూడా ఆర్ఎస్ఆర్ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భూభారతిని తీసుకొచ్చి భూసమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 27 నెలలు దాటినా ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా పెండింగ్‌లోనే పెట్టడం గమనార్హం.
మండలాల్లో రిపోర్టుల దందా..
భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి తహసీల్దార్ల రిపోర్టులు తప్పనిసరి. ఇదే అదును భావిస్తున్న జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లు రిపోర్టులు పంపడంలో అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి కొందరు తహసీల్దార్లు కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై జోరుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కొన్ని భూసమస్యలు తహసీల్దార్ల స్థాయిలోనే పూర్తి అవుతుండడంతో బాధితుల నుంచి అందినకాడికి దండుకుంటున్నట్లు వినికిడి.
రైతులు తమ భూసమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోగానే.. ఆర్ఐలు క్షేత్రస్థాయిలో పర్యటించి పట్టాదారు, భూమి వివరాలను సేకరించి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదికలు ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే తప్పుడు రిపోర్టులను ఉన్నతాధికారులకు పంపుతున్నారని పేర్కొంటున్నారు. ఇటీవల పెద్దేముల్ మండలంలో పనిచేస్తున్న ఆర్ఐ రిపోర్ట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధిత రైతులు ఏసీబీకి పట్టించిన విషయం తెలిసిందే. పలు మండలాల రెవెన్యూ యంత్రాంగం చేస్తున్న వసూళ్లపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.