న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన బురద సునామీ(Nepal Floods) వల్ల.. అక్కడ జల విద్యుత్తు ప్లాంట్లు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్తు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఓ అధికారిక రిపోర్టు ప్రకారం.. గత వారం సంభవించిన వరదల వల్ల నేపాల్‌లో సుమారు 550 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు తెలుస్తోంది. దీని వల్ల నేపాల్ నుంచి భారత్‌కు ఎగుమతి కావాల్సిన విద్యుత్తు కూడా తగ్గిపోయింది. ఇండియాకు సుమారు 400 మెగావాట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ నేపాల్‌కు అవసరం అయితే విద్యుత్తును అందించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి నేపాల్ నుంచి దిగుమతి అయ్యే విద్యుత్తు అంశాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2024 వివరాల ప్రకారం భారత్‌లో 15 గిగా వాట్ల సామర్థ్యం కలిగిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అయితే 2031-32 నాటికి హైడ్రో కెపాసిటీని 50 గిగావాట్లకు పెంచనున్నట్లు తెలుస్తోంది.