అహ్మదాబాద్: రాజకీయ పార్టీ ముసుగులో అక్రమ మార్గాలలో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్న ముఠా గుట్టును గుజరాత్ అధికారులు రట్టు చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ భారతీయ నేషనల్ జనతా దళ్ అగ్రశ్రేణి కార్యవర్గ సభ్యులపై ఐటీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదయ్యాయి. అధికారుల కథనం ప్రకారం ఆ పార్టీ 2019-20 నుంచి 2024-25 మధ్య 56 వేల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి రూ.1,143 కోట్ల నకిలీ రాజకీయ విరాళాలను సేకరించింది. పార్టీ ఖాతాల్లోకి ఆర్టీజీఎస్ లాంటి విధానాల ద్వారా విరాళాలను బదిలీ చేసేందుకు వీరు పన్ను చెల్లింపుదారులను నియమించుకునే వారు.
అనంతరం వారికి డొనేషన్ రసీదులను అందజేసే వారు. తద్వారా వారికి ఆ చెల్లించిన మొత్తానికి నూరు శాతం పన్ను మినహాయింపు లభించేది. తర్వాత ఆ మొత్తాలను జే ట్రేడింగ్, కాజల్ ఎంటర్‌ప్రైజస్, పర్మార్ అసోసియేట్స్ తదితర సొంత సంస్థలకు బదిలీ చేసేవారు. ఆ సంస్థల నుంచి వివిధ కొనుగోళ్లు జరిపినట్టు రసీదులు సృష్టించేవారు. ఆ సంస్థల నుంచి ఆ మొత్తాలను విత్‌డ్రా చేసేవారు. ఇదంతా చేయడానికి వారు 2 నుంచి 10 శాతం కమీషన్ తీసుకునేవారు. తర్వాత ఆ మొత్తాన్ని వాస్తవంగా తమకు రాజకీయ విరాళంగా అందజేసిన వారికి తిరిగి చెల్లించే వారు. కాగా, ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమర్పించిన ఫారం 24ఏపై అనుమానం వచ్చి విచారించగా దాని బండారం బయటపడింది. ఇలా ఈ పార్టీ రూ.343 కోట్ల వరకు ఐటీ విభాగానికి నష్టం కలిగించినట్టు నిర్ధారించారు.