హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ జేఏసీ తలపెట్టిన ఉద్యమాన్ని ఆపలేదని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. తాము ఇచ్చింది తాత్కాలిక విరామమేనని, రాబోయే రోజుల్లో అంచెలంచెల పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఉద్యోగల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై జేఏసీ యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు. స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) 80 వసంతాల వైభవోత్సవాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ ఉద్రేకంగా ప్రసంగించడమే కాకుండా పాటలు పాడి ఆకట్టుకున్నారు.
‘ప్రభుత్వం రెండు డీఏలు ప్రకటించింది. జూలై 2026 డీఏ ఇవ్వాల్సి ఉన్నది. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత మరో డీఏ ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీని ప్రకటించాల్సి ఉన్నది. వీటి సాధనకు జేఏసీగా పోరాడుతామ’ని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ఒక్క పైసా ఇవ్వనని, రెండేండ్ల దాకా డీఏలు, పీఆర్సీ అడుగొద్దన్న ముఖ్యమంత్రి ద్వారానే రెండు డీఏలు సాధించుకున్నామని, ఇదంతా పోరాటం ద్వారానే సాధ్యపడిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చేది ఒక్క గ్రాట్యుటీ మాత్రమేనని, జీపీఎఫ్, కమ్యూటేషన్, ఇన్స్యూరెన్స్లు ఉద్యోగుల సొమ్ములేనని వివరించారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రితో పూర్తిస్థాయి చర్చలు జరుగలేదని పేర్కొన్నారు. 2023 పీఆర్సీని అమలు చేసి, 2028 ఎన్నికల వరకు మరో పీఆర్సీ కమిటీని ఏర్పా టు చేస్తే ఉద్యోగులు సర్కారుర్కు అండగా ఉంటారని చెప్పారు.
ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం: శ్రీధర్‌బాబు
ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులను రూ.25 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు తగ్గించామని వివరించారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య భయాలు, ఆందోళనలు ఉండరాదని, ప్రేమాభిమానాలు, పరస్పర గౌరవం మాత్రమే ఉండాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాలకు మూలపుటమ్మ ఎస్టీయూనేనని కొనియాడారు. ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. నాటి పోరాటాలు, నాయకుల త్యాగాలతోనే టీచర్లు హక్కులు, ప్రయోజనాలు పొందుతున్నామని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్, టీఎన్జీవో అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, పర్వత్‌రెడ్డి, డీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..