విక్రేతలు సహా ఆరుగురి అరెస్టు
రూ.3 లక్షల మత్తు పదార్థాలు స్వాధీనం: సీపీ తరుణ్‌జోషి
సుబేదారి, నవంబర్ 5: హనుమకొండ నక్కలగుట్టలోని ఓ లాడ్జిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు నలుగురు యువకులను టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం వరంగల్ సీపీ తరుణ్ జోషి వెల్లడించిన వివరాలు ఇలా.. బీటెక్ చదువుతున్న వరంగల్ పిన్నవారి వీధికి చెందిన శివ్వా రోహన్, హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి పెంచికల కాశీరావు కలిసి గోవాలో నైజీరియాకు చెందిన జాక్, కాల్జాఫర్ల వద్ద డ్రగ్స్ కొనుగోలుచేసి స్నేహితులకు విక్రయించేవారు. నక్కలగుట్టలోని ఓ లాడ్జ్‌లో వీరు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. రోహన్, కాశీరావుతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3.16 లక్షల విలువైన ఒకటిన్నర గ్రాము కొకైన్, 15 గ్రాములు చరస్,15 ఎల్ఎస్డీ, 36 మత్తు కలిగించే ఎండీఎం ట్యాబ్లెట్లు, గంజాయి నుంచి నూనె తీసే పరికరం, హుక్కా కూజా, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.