AP News | ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం (Jangareddygudem)లో కొత్తరకం దందాకు తెరలేపారు. మత్తు ఇంజక్షన్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మత్తుకు బానిలైనవారికి, యువతకు వీటిని విక్రయిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఈగల్ టీమ్ జంగారెడ్డిగూడెంలో తనిఖీలు చేపట్టాయి. దీంతో ఓ కార్పెంటరీ దుకాణంలో దాచిన ట్రెమడాల్ మత్తు ఇంజెక్షన్లు వెలుగు చూశాయి. సుమారు ఏడువేల మత్తు ఇంజెక్షన్ల వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్ అలీ, మల్లికార్జున వెల్లడించారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని లక్షీశ్రీనివాస్ అనే మెడికల్ ఏజెన్సీ మెడికల్ ఏజెన్సీలో ఈగల్ టీమ్ (Eagle Team), డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు కిశోర్‌ను ప్రశ్నించగా తన వద్ద ఆ ఇంజెక్షన్లు లేవని, వాటిని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశానని చెప్పాడు. అతడు చెప్పినతీరుపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని అదుపులోకి వారి స్టైల్లో విచారించగా మత్తు ఇంజెక్షన్ల దందా గుట్టు రట్టు అయ్యింది.
కిశోర్ తన స్నేహితుడు కుమార్ నడుపుతున్న కార్పెంటరీ దుకాణంలో ట్రెమడాల్ (Tremadol) ఇంజెక్షన్లు దాచి ఉంచినట్లు అధికారులకు వెల్లడించాడు. దీంతో ఆ దుకాణంలో నాలుగు బాక్సుల్లో దాచి ఉంచిన ఏడువేలకు పైగా వయల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భవానీ మెడికల్స్ షాపునకు మూడు వేల ఇంజెక్షన్లు అమ్మినట్లు కిశోర్ అధికారులకు వెల్లడించాడు.