సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): నగరానికి తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-3 పెద్దాపూర్‌లోని పంపు హౌస్‌లో పాతబడిన హెచ్‌టీ ఎలక్ట్రికల్ ప్యానెల్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. అదేవిధంగా పెద్దపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్ లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లు, సింగాపూర్ నుంచి పెద్దాపూర్ వరకు ఉన్న 2000 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను మారుస్తూ మరమ్మతులు చేపడుతున్నారు.
ఈ పనులను శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో 36 గంటలు షేక్‌పేట రిజర్వాయర్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనున్నదని, భోజగుట్ట ప్రాంతానికి లోప్రెజర్‌తో నీటి సరఫరా ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా మణికొండ, కోకాపేట, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాలకు నిరఫరా నిలిచిపోతుందన్నారు. ట్రాన్స్మిషన్ 1, 2 ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తారని వివరించారు.