
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దివంగత డాక్టర్ పీవీ చలపతిరావు గొప్ప సర్జన్ అని, ఆయన లోటు పూడ్చలేనిదని ‘ద అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’ (ఏఎస్ఐ) కొనియాడింది. శుక్రవారం ముంబైలో ఏఎస్ఐ 81వ వార్షిక సదస్సు (ఏఎస్ఐసీవోఎన్-2021) ప్రారంభమైంది. మూడు రోజుల సదస్సులో భాగంగా శనివారం డాక్టర్ పీవీ చలపతిరావు స్మారక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలను ముంబైకి చెందిన డాక్టర్ వీఎన్ శ్రీఖండే వివరించారు. ‘చలపతిరావు 1994లో ఏఎస్ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు.. ఆయన కుమారుడు డాక్టర్ పీ రఘురాం 2020లో ఏఎఎస్ఐ అధ్యక్షుడిగా పనిచేశారు. తద్వారా అసోసియేషన్ చరిత్రలో మొదటిసారి తండ్రీకొడుకులు అధ్యక్షులుగా పనిచేసిన రికార్డు సాధించారు. చలపతిరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1963 నుంచి 1983 వరకు ప్రొఫెసర్గా సేవలు అందించారు. అనంతరం హైదరాబాద్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ దవాఖాన చైర్మన్గా 2002 వరకు సేవలు అందించారు. చివరగా కిమ్స్ దవాఖానకు 14 ఏండ్లపాటు డైరెక్టర్గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో క్లిష్టమైన సర్జరీలు చేసి జాతీయ స్థాయిలో పేరు గడించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఐఏఎస్జీ) ఏర్పాటులో కీలకపాత్ర పోషించి 1991లో అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించిన చలపతిరావు 2020 నవంబర్ 22న తుది శ్వాస విడిచారు’ అని వివరించారు.