అయిజ, ఆగస్టు 10 : డాక్టర్ ప్రియాంక భౌతికకాయానికి కుటుంబీకులు, బంధువులు, స్థానికులు కన్నీటితో నివాళులర్పించారు. ఏపీలోని రాజమండ్రి వద్ద ప్రమాదానికి గురై వారం రోజులు దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సోమవారం సాయంత్రం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి ప్రియాంక మృతదేహం చేరగానే అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పాత బస్‌స్టాండ్ సర్కిల్లో ధర్నాకు దిగారు. అఖిలపక్ష కమిటీ నాయకులు, బంధుమిత్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రియాంక మృతికి కారకులైన నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా 3 నెలల్లో శిక్ష అమలు చేసేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.3 కోట్లు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
స్థానిక అయ్యప్పస్వామి ఆలయం నుంచి కొత్త బస్‌స్టాండ్ కూడలి వరకు అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం మెడికో సొంతూరైన ఎక్లాస్‌పురానికి తరలించారు. ప్రియాంక భౌతికకాయం గ్రామానికి చేరగానే ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రియాంక అంత్యక్రియలకు జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అంతిమ యాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు, గద్వాల ఎమ్మెల్యే, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. నిందితులకు శిక్షణ అమలు చేసేలా ఏపీ సర్కార్‌తో చర్చలు జరుపుతామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రియాంక కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని ఏపీ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం ఎక్లాస్‌పురానికి చేరుకున్న ఆయన ప్రియాంక మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కోరిక మేరకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ప్రియాంక తండ్రికి అందజేశారు. కిమ్స్‌లో వైద్య ఖర్చులను రీయింబర్స్మెంట్ చేస్తామని, పీజీకి కట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
గద్వాల, ఆగస్టు 10 : ప్రియాంక మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే తలంపుతో వైద్య విద్య అభ్యసిస్తూ అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలచి వేసిందని పేర్కొన్నారు. నిందితులపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.