Supreme Court : జాతీయస్థాయి పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు చేపట్టిన ‘చలో సంసద్ (Chalo Samsad)’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఈ అంశాన్ని ప్రస్తావించగా.. “మా సమయం వృథా చేయొద్దు” అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakanth) నేతృత్వంలోని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
మంగళవారం ఉదయం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు తనవద్ద ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాటిని పరిశీలించి గురువారం విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన సీజేఐ.. ‘తాము వీడియోలు చూడాలనుకోవడం లేదు. వాటిని చూసే సమయం మాకు లేదు. మీ మా సమయాన్ని వృథా చేయొద్దు’ అని స్పష్టంచేస్తూ తక్షణ విచారణ అభ్యర్థనను తోసిపుచ్చారు.
జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నీట్ వంటి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత జూలై 20, 21 తేదీల్లో ‘చలో సంసద్’ కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున జంతర్‌మంతర్ వద్ద ఈ నిరసన చేపట్టగా అది ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతోపాటు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. అయితే ఆందోళనకారులు హింసాత్మకంగా అదుపుతప్పి ప్రవర్తించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను నిన్న ఢిల్లీ హైకోర్టు కూడా అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. ‘ఇలాంటి అన్ని విషయాల్లోకి కోర్టును లాగొద్దు’ అని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే తరహాలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు రెండూ తక్షణ విచారణకు నిరాకరించడంతో పిటిషనర్లు ఇప్పుడు సాధారణ రిజిస్ట్రీ ప్రక్రియ ద్వారా తమ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.