న్యూఢిల్లీ: ఇటీవల మృతిచెందిన ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్.. మ్యాజిక్ డెలివరీస్‌తో అబ్బురపరిచినా.. అతడు ఆల్ టైమ్ గ్రేట్ స్పిన్నరేం కాదని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతడు అద్భుతమైన బంతులతో ప్రపంచాన్ని సమ్మోహన పరిచినా.. భారత్ వంటి దేశాల్లో సాధారణ బౌలరే అని సన్నీ పేర్కొన్నాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టిన వార్న్ గత శుక్రవారం గుండెపోటుకు గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ‘నా వరకైతే షేన్ వార్న్ నంబర్‌వన్ కాదు. అతడికంటే భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరనే గొప్ప. భారత్‌పై అతడి రికార్డు చూస్తే చాలు. అతడు ఎంత సాధారణ బౌలరో స్పష్టమౌతుంది. భారత గడ్డపై వార్న్ ఒక్కసారి మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే భారత ఆటగాళ్లపై వార్న్ పాచిక పారలేదు. అతడితో పోలిస్తే మురళీధరన్‌కు టీమ్ఇండియాపై మెరుగైన రికార్డు ఉంది’ అని గవాస్కర్ వివరించాడు. కాగా.. ఈ అంశంపై ఆసీస్ మీడియా మండిపడింది. వార్న్ ప్రతిభను తక్కువచేసి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని గవాస్కర్‌పై విరుచుకుపడింది.