Iran Warning : పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇజ్రాయెల్ (US-Israel) దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ (Iran) పై భూతల దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)’ తీవ్ర హెచ్చరిక చేసింది. ‘మీ పిల్లలను, సైనికులను ఇరాన్ గడ్డ మీదికి పంపి వారిని బలి చేయవద్దు’ అని అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ సరిహద్దుల వద్ద అమెరికా, ఇజ్రాయెల్ దళాలు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయంటూ వినపడుతున్న వార్తల నేపథ్యంలో ఐఆర్జీసీ ఈ హెచ్చరికలు చేసింది. తమ దేశంలోకి అడుగుపెట్టే ఏ శత్రు సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి బయటికి వెళ్లలేడని స్పష్టంచేసింది. దేశ రక్షణ కోసం లక్షలాది మంది సైనికులు, అత్యాధునిక క్షిపణులు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఇరాన్ ప్రకటించింది.
తమను తాము రక్షించుకోవడమే కాకుండా శత్రువుల స్థావరాలపై ఎదురుదాడి చేసే సామర్థ్యం కూడా తమకు ఉందని ఇరాన్ పేర్కొన్నది. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే అది కేవలం ఇరాన్‌కే పరిమితం కాదని, మొత్తం పశ్చిమాసియాకు వ్యాపిస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన శత్రు దేశాల ప్రజలలో భయాందోళనలు సృష్టించేందుకు మానసిక యుద్ధానికి తెరలేపినట్లు అనిపిస్తోంది.
‘యుద్ధానికి మీ పిల్లలను పంపి అనవసరంగా చంపించవద్దు.. వారిని నరకానికి పంపిచవద్దు’ అనే నినాదాన్ని ఇరాన్ సైన్యం విస్తృతంగా ప్రచారంలోకి తెస్తున్నది. మా దేశంలో అడుగుపెడితే చంపేస్తామంటూ మానిసికంగా ఇజ్రాయెల్ ప్రజలను భయంలోకి నెడుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.