ఊట్కూర్ : మత సమరస్యానికి ప్రతికగా జరుపుకునే మొహరం ( Muharram ) ఉత్సవ వేడుకల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్( Utkoor ) మండల కేంద్రంలో హసన్, హుస్సేన్ పీర్ల సవారిని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం, సాయంత్రం పీర్ల చావడి నుంచి పురవీధుల్లో నిర్వహించిన సవారి (ఊరేగింపు) లో కుల, మతాల కతీతంగా భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
వేడుకల సందర్భంగా యువకుల అలైబలై ఆటలు, మహిళలు బొడ్డెమ్మలతో సందడి చేస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. గ్రామంలోని రుద్రా నగర్ వీధిలో నిర్వహించిన డోలారోహణం ( Dolarohanam) కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆరకటికే వంశంలో పుట్టిన పసి బిడ్డలను ఊయలలో ఊగించి నామకరణం చేశారు.
ఆదివారం రెండవ రోజు దశమి వేడుకల సందర్భంగా భక్తులు గొర్రెలు, మేకలతో కందూర్లు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రామ్ లాల్, ఎస్సై లు రమేష్, శివ శంకర్, మద్దయ్య, రేవతి, గాయత్రి బందోబస్తులో పాల్గొన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లి పీర్ల చావడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు మిఠాయిలను పంచి పెట్టారు.