A. R. Rahman | ఏ ఆర్ రెహమాన్.. సంగీత ప్రపంచానికి ఈయన పేరు ఓ సన్సేషన్.. అతి తక్కవ సమయంలోనే సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత రెహ్మాన్‌కే దక్కుతుంది. రోజా, బొంబాయి, రంగీలా, తాళ్, లగాన్, రంగ్ దే బసంతి ఇలా ఆయన స్వరాల మ్యాజిక్‌తో మెస్మరైజ్ అయిన సినిమాలు ఎన్నో వున్నాయి.
ప్రస్తుతం తెలుగులో రామ్‌చరణ్-బుచ్చిబాబు కలయికలో రానున్న ఆర్సీ 16 చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన సంగీత చర్చలు కూడా జరుగుతున్నాయి. కాగా ఓసారి ఏఆర్ రెహమాన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అయితే తన అసలు పేరు దిలీప్ కుమార్. నుంచి ఏఆర్ రెహమాన్‌గా ఎందుకు మారిందో కూడా ఇందులో వివరించాడు.
రహమాన్ అసలు పేరు ఎ.ఎస్. దిలీప్ కుమార్. హిందువుల కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి పోవడంతో కుటుంబ భారమంతా ఆయన పైనే పడింది. పదకొండో సంవత్సరంలోనే ఇళయరాజా టీమ్‌లో కీబోర్డు ప్లేయర్‌గా చేరాడు. ఇక1980 సంవత్సరంలో రహమాన్ సోదరికి అంతు లేని వ్యాధి సోకింది.ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. ఆమెపై ఆశలు అడుగంటుతున్న తరుణంలో ఎవరో తెలిసిన వాళ్లు ఇచ్చిన సలహాతో కుటుంబ సభ్యులు ముస్లిం పీర్ షేక్ అబ్డుల్ ఖాదీర్ జిలానీ దగ్గరకు వెళ్లారు. ఆయన అల్లాను ప్రార్థించారు.
అనూహ్యంగా ఆమె మామూలు మనిషిగా మారిపోయింది. జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఇక కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దాంతో అల్లాకు కృతజ్ఞతగా వాళ్లంతా ఇస్లాం మతాన్ని స్వీకరించారు. దీలీప్కుమార్గా వున్న తన పేరును రహమాన్‌గా మార్చుకున్నాడు. కస్తూరిగా వున్న ఆయన తల్లి కరీనా బేగంగా పేరు మార్చుకుంది. అంతేకాదు ఈ సమయం నుంచే రహమాన్‌కు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం పెంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే వారి సలహా మేరకే తన పేరుకు ముందు ఎ.ఆర్.ను యాడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఎన్నో విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.