Lingad | మార్కెట్లో మనకు రకరకాల కూరగాయలు లభిస్తుంటాయి. మనకు అందుబాటులో ఉండే రెగ్యులర్ కూరగాయలనే మనం తెచ్చుకుని వండి తింటుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనం చిత్రాతిచిత్రమైన కూరగాయలను కూడా చూస్తుంటాం. అసలు వాటిని కూరగాయలు అంటారా, అవి ఏమిటి.. వాటిని ఎలా తినాలి..? అని కూడా సందేహిస్తుంటాం. కానీ అలాంటి కూరగాయల్లోనే అనేక పోషకాలు ఉంటాయి. వాటిని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఇప్పుడు చెప్పబోయే కూరగాయ కూడా సరిగ్గా అలాంటిదే. అదే.. లింగాడ్. దీన్నే లింగడ్ అని, లుంగుడు కస్రోడ్ అని కూడా పిలుస్తారు. ఈ కూరగాయ చూసేందుకు చాలా చిత్రంగా ఉంటుంది. ఇది ఫెర్న్ జాతికి చెందిన మొక్క లాగా కనిపిస్తుంది. మన దేశంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ కూరగాయలను ఎక్కువగా పండిస్తారు. ఈ కూరగాయను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
లింగాడ్ కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఈ కూరగాయల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది. ఈ కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. అలాగే మలబద్దకం తగ్గుతుంది. కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
లింగాడ్ కూరగాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు తగ్గిపోతాయి. ఈ కూరగాయలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఈ కూరగాయల్లో అధికంగా ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఈ కూరగాయల్లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు సైతం ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి మేలు చేస్తాయి. ఈ కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
100 గ్రాముల లింగాడ్ కూరగాయలను తింటే సుమారుగా 35 నుంచి 45 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 2 నుంచి 6 గ్రాములు, ఫైబర్ 4 గ్రాములు, విటమిన్లు ఎ, సి, బి విటమిన్లు, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్ వంటి మినరల్స్ వీటిల్లో అధికంగా ఉంటాయి. లింగాడ్ కూరగాయలు మనకు సీజన్లోనే కనిపిస్తాయి. వర్షాకాలంలో మనం వీటిని మార్కెట్లో చూడవచ్చు. వీటిని వండే ముందు శుభ్రంగా కడిగి కట్ చేసి వండాల్సి ఉంటుంది. పూర్తిగా ఉడకని లేదా శుభ్రంగా కడగని లేదా పచ్చి లింగాడ్ కూరగాయలను తింటే విషంగా మారే ప్రమాదం ఉంటుంది. కొందరికి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ కూరగాయలను రెగ్యులర్‌గా చేసుకునే కూరలు, వేపుళ్ల మాదిరిగా లేదా పచ్చళ్ల మాదిరిగా చేసుకుని తినవచ్చు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ వీటిని తింటే అనేక లాభాలను పొందవచ్చు.