మేడ్చల్ జోన్ బృందం, ఏప్రిల్ 8 : కేంద్రం దిగొచ్చి, తెలంగాణలో రైతులు పండించిన వడ్లను కొనే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో రైతులతో కలిసి ఆయన శుక్రవారం నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు రైతుల ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జలజ, రైతులు కొండల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి, ఘట్కేసర్, కీసర మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతుల ఇండ్లపై నల్ల జెండాలను ఎగురవేసి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.