మహబూబ్ నగర్ : బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌కు దీటుగా శిల్పారామాన్ని( Shilparam ) నిర్మాణం చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) పేర్కొన్నారు. శిల్పారామాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ( Private Persons ) ఇవ్వ వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని శిల్పారామాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తులతో పాటు చేనేత కార్మికులకు తక్కువ ధరతో ఇవ్వాలని శిల్పారామాన్ని నిర్మాణం చేమమని వెల్లడించారు.
మధ్యతరగతి ప్రజలకు చిన్న చిన్న ఫంక్షన్లు తక్కువ ధరతో ఇవ్వాలని కన్వెన్షన్ హాల్ నిర్మాణం, చిన్న పిల్లల పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పనులు ఎందుకు నిలిచిపోయాయో మంత్రి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. శిల్పారామం టూరిజం ప్రాపర్టీ కానప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ వ్యక్తులకు ఎలా లీజ్‌కు ఇస్తారని ప్రశ్నించారు.
చెరువు కట్టల మీద ముడా నిధులతో షాపుల నిర్మాణం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. రెవెన్యూ యాక్ట్ కింద అధికారుల నుంచి రికవరీ చేయిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ శాఖకు నిర్వహణ చేయడానికి సాధ్యం కాకుంటే మహిళా సంఘాలకు, కుల వృత్తుల వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు జ్యోతి, సత్యం, నవకాంత్, ఈశ్వరయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, సీనియర్ నాయకులు జహంగీర్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, సాయిలు, క్రాంతి తదితరులు ఉన్నారు.