F1 in India : భారత్‌లో మోటార్ స్పోర్ట్స్ వేగం పుంజుకోనుంది. ఫార్ములా వన్ రేసును ఆరంభించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ పావులు కదుపుతోంది. క్రీడా మంత్రి మన్సూఖ్ మాండవీయ(Mansukh Mandaviya) టాస్క్ ఫోర్స్(Task Force)ను ఏర్పాటు చేశారు. త్వరలోనే ఫార్ములా వన్.. వంటి మోటార్ స్పోర్ట్స్ పోటీల నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు. 2028లో భారత గడ్డపై మోటార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ జరపడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ సలహాలు, సూచనలు ఇవ్వనుంది.
సాకర్‌తో పాటు మోటార్ స్పోర్ట్స్ వంటి ఆటల్ని ఇష్టపడే భారతీయులు చాలామందే. బుల్లెట్ వేగంతో రయ్‌రయ్‌మంటూ ట్రాక్ మీద కార్లు దూసుకెళ్లే ఫార్ములా వన్ను చూసేందుకు రెండు కళ్లు చాలవు. అందుకే.. ఈ ఆటను మనదేశంలోకి మళ్లీ తీసుకొచ్చేందుకు క్రీడల మంత్రి మన్సూఖ్ మాండవీయ ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతదేశంలో ప్రస్తుతం మోటార్ స్పోర్ట్స్ పరిస్థితి ఎలా ఉంది? అనేది తేల్చడం కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఈ ఆటను మరింత విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు, విధివిధానాల ఖరారు బాధ్యతల్ని ప్రత్యేక బృందానికి అప్పగించినట్టు మాండవీయ వెల్లడించారు.
🚨 F1 TO RETURN TO INDIA🚨
Sports Minister Mansukh Mandaviya has proposed a Task Force to assess hosting F1 events, with a potential return targeted for 2028.
Read Here👇#Formulaone #F1 #Indiahttps://t.co/RxDZJSgpwY
— India Today Sports (@ITGDsports) June 20, 2026
భారత్‌లో మోటార్ స్పోర్ట్స్ అధ్యయనానికి నలుగురు – ఐదుగురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మనదేశంలో ఈ ఆటకు ఎంత ఆదరణ ఉంది? మోటార్ స్పోర్ట్స్ విస్తరణ అవకాశాలు.. వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ దృష్టి సారించనుంది. భారత్‌లో ఈ ఆటను అభివృద్ధి చేయడం ద్వారా ఒనగూరే అంతర్జాతీయ, ఆర్ధిక, పర్యాటక, పెట్టుబడి పరమైన ప్రయోజనాలను ఈ బృందం అధ్యయనం చేయనుంది. రెండేళ్లలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వహించడమే మా లక్ష్యం అని మాండవీయ పీటీఐతో పేర్కొన్నారు. నిరుడు డిసెంబర్లో భారత్‌లో మోటార్ స్పోర్ట్స్ అభిమానుల సంఖ్య 7.9 కోట్లుగా ఉందని ఫార్ములా వన్ గణాంకాలు వెల్లడించాయి.