– 24 గంటల కంట్రోల్ రూమ్
– టౌన్-1, టౌన్-2 ప్రత్యేక రెస్క్యూ బృందాలతో ప్రజలకు భరోసా
– అత్యవసర సమస్యలపై తక్షణ స్పందన
నల్లగొండ, జూన్ 20 : రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, నీటి నిల్వలు, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెట్లు కూలిపోవడం, రోడ్లు దెబ్బతినడం, తాగునీటి సరఫరా అంతరాయాలు, విద్యుత్ సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మేయర్ ఆదేశాలు, మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో నగర వ్యాప్తంగా ప్రత్యేక మాన్సూన్ సన్నద్ధత చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయ చర్యల కోసం 24 గంటల మాన్సూన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు నగరాన్ని టౌన్-1, టౌన్-2 ప్రాంతాలుగా విభజించి ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు.
కమిషనర్ బి.శరత్ చంద్ర ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ బృందాలలో వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, వాటర్ సప్లయ్ సిబ్బంది, ఎలక్ట్రిషియన్ సిబ్బంది, హరితహారం బృందాలు, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది సహా 150 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించేందుకు ఈ బృందాలు 24 గంటలూ సిద్ధంగా ఉండనున్నాయి.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ : 08682 – 220100
ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వెంటనే సంబంధిత బృందాలకు చేరవేసి సమస్యలను పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్లో మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.
వర్షపు నీరు ఎటువంటి అవరోధం లేకుండా ప్రవహించేలా నగరంలోని ప్రధాన డ్రైన్లు, వర్షపు నీటి కాలువలు, కల్వర్టులు మరియు లోతట్టు ప్రాంతాలలో విస్తృత స్థాయిలో డీసిల్టింగ్ పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను నివారించేందుకు నగరంలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజూ ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
– భారీ వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాకపోతే ఇళ్ల నుండి బయటకు రావద్దని కమిషనర్ బి.శరత్ చంద్ర సూచించారు.
– అలాగే ప్రజలు ఇంటి చెత్తను డ్రైనేజీలు, కాలువలు అలాగే రోడ్లపై వేయకుండా ప్రతిరోజూ వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు మాత్రమే అందించాలని కోరారు.
– డ్రైనేజీలలో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి వరద పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
నగరంలో ఎక్కడైనా చెట్లు కూలిపోవడం, డ్రైనేజీలు మూసుకుపోవడం, నీటి నిల్వలు ఏర్పడడం, తాగునీటి సరఫరా సమస్యలు, వీధి దీపాల లోపాలు, రోడ్లు దెబ్బతినడం, ప్రమాదకర భవనాలు లేదా గోడలు కూలే పరిస్థితులు, ఇతర అత్యవసర సమస్యలు గమనించిన వెంటనే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 24×7 కంట్రోల్ రూమ్ 08682 – 220100 కు సమాచారం అందించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.