Bandla Ganesh | సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన చిన్నారి నిరంజన్ కుటుంబానికి తాను ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని స్వయంగా అందజేశారు. హనుమకొండ హనుమాన్ నగర్‌లోని నిరంజన్ నివాసానికి వెళ్లిన బండ్ల గణేశ్, చిన్నారితో కాసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలతో నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తన పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ తరఫున రూ.5 లక్షల చెక్‌ను వారికి అందజేసి, భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బండ్ల గణేశ్, “నేను పవన్ కల్యాణ్ గారి భక్తుడిని. దైవసమానులైన పవన్ కల్యాణ్ గారు ఈ బాబును పరామర్శించినప్పుడే నిరంజన్ గురించి నాకు తెలిసింది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం చేశాను. మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కల్యాణ్ గారి దయే కారణం” అని అన్నారు.
ప్రస్తుతం తన కూతురి వివాహ పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఈ రోజే వచ్చి సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ రోజు రూ.5 లక్షల సాయాన్ని నిరంజన్ కుటుంబానికి అందించడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన సందర్భంగా నేను ఎలాంటి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.