కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఒక వ్యక్తి గన్‌తో హల్ చేశాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) ఆ ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలో తన భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చేతిలో పిస్టల్ ఉన్న అతడు బీజేపీ వ్యక్తి అని, ఎంతకైనా తెగించడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు.
కాగా, అభిషేక్ బెనర్జీ శనివారం దీని గురించి ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ‘నిన్న రాత్రి నేను ఢిల్లీ నుంచి కోల్‌కతా విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఆయుధాలు ధరించిన వ్యక్తులను పట్టుకున్నారు. ఇది భద్రతపై, అలాగే కొందరు ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది’ అని అందులో పేర్కొన్నారు. పిస్టల్ వంటి ఆయుధాన్ని చేతిలో పట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వీడియో క్లిప్‌ను ఆయన షేర్ చేశారు.
మరోవైపు టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు త్రిపురకు చెందిన ‘నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ పార్టీలో విలీనమయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అయిన అభిషేక్ బెనర్జీ శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తిరుగుబాటు ఎంపీలపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోల్‌కతా చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన జరిగినట్లు టీఎంసీ పేర్కొంది.