హత్నూర, మే 3: మనిషి జీవితంలో పెండ్లి ఒక గొప్ప కార్యం. అలాంటి వివాహ వేడుకను లక్షలు వెచ్చించి హంగు ఆర్భాటాలతో జరపుకొనేందుకే ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. తమ బిడ్డ బాగా బతకాలని ఆర్థిక స్తోమత లేకపోయినా అప్పోసప్పో చేసి కట్నం ఇచ్చి ఘనంగా నిర్వహించాలని చూస్తుంటారు తల్లిదండ్రులు. మరి నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పరిస్థితి ఏంటి?, అలాంటి వరకట్న దురాచారాన్ని రూపుమాపి ఆదర్శ వివాహాలను ఆచరణలోకి తెస్తున్నది సంగారెడ్డి జిల్లా హత్నూర మండల మహిళా సమాఖ్య. గత ఏడాది హత్నూర మండలంలోని నస్తీపూర్‌లో సమాఖ్య నాయకులు ఓ జంటకు ఆదర్శ వివాహం జరిపించారు.
ఈ నెల 5న మరోసారి సమాఖ్య తరఫున ఐదు జంటలకు వివాహాలు జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సామూహిక ఆదర్శ వివాహాలకు హత్నూర మండల కేంద్రం వేదిక కానున్నది. కట్నం తీసుకోని యువకులను గుర్తించి పేద యువతులతో పెండ్లిళ్లు చేయించడానికి మహిళా సమాఖ్య ప్రతినిధులు కృషిచేస్తున్నారు.
ఈ నెల 5న బడంపేటకు చెందిన మల్లీశ్వరికి అల్మాయిపేటకు చెందిన కృష్ణతో, మాధురకు చెందిన సంతోషకు వడ్డెపల్లికి చెందిన భిక్షపతితో, రాయిలాపూర్‌కు చెందిన శైలజకు సికింద్లాపూర్కు చెందిన దుర్గేశ్‌తో, పన్యాలకు చెందిన సంధ్యకు బ్రాహ్మణపల్లికి చెందిన పోచయ్యతో, మాధురకు చెందిన మానసకు అక్సాన్పల్లికి చెందిన యాదయ్యతో ఆదర్శ వివాహాలు జరిపించనున్నారు. పెండ్లికి కావాల్సిన పట్టువస్ర్తాలు, పుస్తెమెట్టెలు మహిళా సంఘం ఆధ్వర్యంలో సమకూర్చారు. వివాహానికి హాజరయ్యేవారికి భోజన సదుపాయాన్ని వారే కల్పిస్తున్నారు. పలువురు దాతలు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ఆడపిల్లల తల్లిదండ్రులకు కట్నం భారం కాకూడదు. ఆడపిల్ల పెండ్లికోసం అప్పులుచేసి అనేక అవస్థలు పడుతుంటారు. అలా ఇబ్బందులు పెట్టొద్దనే కట్నం తీసుకోకుండా పెండ్లిచేసుకొనేందుకు ముందుకొచ్చా.
-గౌడెల్లి భిక్షపతి, వరుడు,
వడ్డ్డేపల్లి, మం:హత్నూర, జిల్లా సంగారెడ్డి