హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైతుబంధు పథకం రూ.50 వేల కోట్ల పంపిణీ మార్క్ దాటడం చారిత్రక సందర్భమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని రైతులకు చాటిచెప్పేందుకు రైతుబంధు సంబురాల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం రైతుబంధు సంబురాల కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయశాఖ అధికారులు, డీఏవోలతో మంత్రి నిరంజన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దేశంలో తెలంగాణ మినహా మరే రాష్ట్రం కూడా రైతుకు నేరుగా ఇన్ని నిధులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. వ్యవసాయరంగానికి ఏటా రూ.60 వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించడం అసాధారణ విజయంగా అభివర్ణించారు. రైతుబీమా కింద ఏటా రూ.1,450 కోట్లు కేటాయిస్తున్నదని, మూడేండ్లలో 71,414 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3,570.70 కోట్ల పరిహారం చెల్లించిందని పేర్కొన్నారు. రైతుబంధు కింద 8 విడతల్లో రూ.50,600 కోట్లు వెచ్చించిందని, రుణమాఫీకి రూ.17,244 కోట్లు, పంట నష్టపరిహారానికి రూ.1,324.64 కోట్లు, ఉచిత కరెంటుకు రూ.10 వేల కోట్లు, విద్యుత్‌రంగ మౌలిక సదుపాయాలకు రూ.28,473 కోట్లు, సాగునీటి కల్పనకు రూ.1,07,315 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.485.59 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.951.29 కోట్లు, 2,601 రైతువేదికలకు రూ.672.80 కోట్లు, కల్లాల నిర్మాణానికి రూ.750 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు.
రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుబంధు దేశ వ్యవసాయరంగానికే దిక్సూచిగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రైతుబంధుతో సేంద్రియ సాగు చేస్తూ అధిక దిగుబడి సాధించి జాతీయస్థాయిలో ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు 2021 పొందిన మల్లికార్జున్‌రెడ్డి తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారని, రైతుబంధు వారోత్సవాల సందర్భంగా రైతుల స్వీయచిత్రాలను, ఫొటోను సోషల్ మీడియా ద్వారా తనకు పంపించాలని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.