కొత్తగా ఆసరా పింఛన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించడమే కాకుండా మిగతా అర్హులైన వారికి పింఛన్ల మంజూరు చేసింది. జిల్లాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే 3,79,185 మందికి పింఛన్లు ఉండగా కొత్తగా 1,14,965 మందికి మంజూరయ్యాయి. దాంతో మొత్తం పెన్షన్ల సంఖ్య 4,94,150కి చేరింది. కొత్తగా మంజూరైన పెన్షన్లలో నల్లగొండ జిల్లాలో 51,007, సూర్యాపేటలో 33,808, యాదాద్రి భువనగిరిలో 30,150 ఉన్నాయి.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ)
సంక్షేమానికి సర్కారు పెద్దపీట
ఓ వైపు తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే మరోపక్క పేదల సంక్షేమానికి సర్కారు పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, వృత్తిదారులు, ఒంటరి మహిళలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన పథకమే ఆసరా పింఛన్లు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన వారంలోపే లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ సర్కారుకే ఎల్లవేళలా ప్రజల మద్దతు ఉంటుంది.
– నారబోయిన స్వరూపారాణి, చైర్పర్సన్, జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్
వివిధ సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ పేదల పక్షపాతిగా నిలిచారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని యడవెల్లి, తాళ్లశింగారం గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ నగదును రెట్టింపు చేసి ఆత్మగౌరవంతో బతికేలా భరోసా కల్పించిందన్నారు. గత ఎన్నికల్లో పింఛన్లను రూ.2వేలకు పెంచుతామన్న హామీకి కట్టుబడి సీఎం కేసీఆర్ నేడు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచ్ కొచ్చెర్ల బాబు, ఎంపీటీసీ ఏర్పుల నరేశ్, ఎంపీడీఓ ఇందిర, తాసీల్దార్ జమీరుద్దీన్ పాల్గొన్నారు.
కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ధి
మాల్, ఆగస్టు 24 : అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ముఖ్య మంత్రి కేసీఆర్ పాలనలోనే అందుతున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలో కొత్తగా మంజూరైన 1618 మంది లబ్ధిదారులకు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కంకణాల ప్రవీణ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, ఆ పార్టీ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, కిష్టారెడ్డి, శ్రీదేవీశ్రీనివాస్, కుంభం శ్వేతా శ్రీశైలం, రవి, రవీందర్‌గౌడ్, అక్రమ్యాదవ్, ఖాలేద్, కొండల్నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా 7,892 మందికి..
మునుగోడు, ఆగస్టు 24 : మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 7,892 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేసింది. మునుగోడులో 1,478, చండూరు 1,596, మర్రిగూడ 1,439, నాంపల్లి 1,112, సంస్థాన్‌నారాయణపురం 1,424, చౌటుప్పల్‌లో 843 మంది లబ్ధిదారులు ఉన్నారు.
ప్రకటించిన వారంలోపే…
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఈ నెల 7న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రకటించారు. ఆపై వారం రోజుల్లోపే సర్కారు పింఛన్లను మంజూరు చేసింది. పాత లబ్ధిదారులతో పాటు కొత్తవారికి పింఛన్లతో పాటు బార్‌కోడ్‌తో ఉన్న కొత్త గుర్తింపు కార్డులను ప్రభుత్వం ముద్రించింది. ఈ కార్డులను ఈ నెల 17న మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేశారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్త పింఛను గుర్తింపు కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు.
ఎవరి చుట్టూ తిరుగకుండా..
సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే కొత్త పింఛను కార్డులు మంజూరు కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చుట్టూ నెలల తరబడి తిరుగకుండా, ఎవరికీ పైసా లంచం ఇవ్వకుండానే తమకు పింఛన్లు మంజూరయ్యాయని, ఇలాంటి ప్రజా ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదని ప్రశంసిస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టీఆర్ఎస్కే వచ్చే ఎన్నికల్లోనూ పట్టం కడుతామని చెబుతున్నారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
వ్యవసాయం చేసుకుందామన్నా నాకు గుంట భూమి కూడా లేదు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఆసరా పింఛను కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నా. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే నాకు పింఛను మంజూరు చేసిండ్రు. అధికారుల చుట్టూ తిరుగకుండా నేరుగా కొత్త పింఛను కార్డులను అందిస్తున్నరు. పేదల బాధలు అర్థం చేసుకొని సంక్షేమ పథకాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాల.
– జి.యాలాద్రి, లబ్ధిదారుడు, కొంపల్లి, మునుగోడు మండలం
నల్లగొండ జిల్లాలో మందికి 52,176 వృద్ధాప్య పింఛన్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దాంతో జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య పింఛన్లు 52,176కి చేరింది. దివ్యాంగులు 28,694, వితంతువులు 71,622, చేనేత 2,733, గీత కార్మికులు 7,162, ఒంటరి మహిళలు 7,166, హెచ్ఐవీ బాధితులు 1,637, బోదకాలు బాధితులు 770 మొత్తం 1,70,323 మంది ఉన్నారు.
లబ్ధిదారుల్లో ఆనందం
సర్కారు ఇస్తున్న కొత్త పింఛన్లతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముసలితనం రావడంతో తమ కొడుకులు కూడా పట్టించుకోవడంలేదని అవ్వా తాతలు చెబుతున్నారు. పెద్ద కొడుకు లెక్క చూసుకుంటున్న సీఎం కేసీఆర్ వందేండ్లు సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నారు. కష్టకాలంలో తమను ఆర్థికంగా ఆదుకుంటున్నారని వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులు పేర్కొంటున్నారు. దివ్యాంగులు సైతం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని సంతోషం వెలిబుచ్చుతున్నారు.
ఆగస్టు 15 నుంచి పంపిణీ..
వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సును 67 నుంచి 57 సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు కుటుంబంలో ఒకరిని గుర్తించడంతోపాటు ప్రతి కుటుంబంలో అర్హత కలిగిన వారందరికీ ఫించన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం వివిధ వర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయగా ఆగస్టు 15 నుంచి కొత్త ఫించన్లు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదే రోజు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పింఛన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. అర్హత కలిగిన పించన్ లబ్ధిదారులకు జిల్లా వ్యాప్తంగా ఎంపికైన అర్హులకు రెండు రోజుల్లో పింఛన్ కార్డులను పూర్తి స్థాయిలో అందించనున్నారు.
నాడు రూ.200 నేడు రూ.2116..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్నింటా అన్యాయమే జరిగింది. కనీసం పింఛన్లను కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2016కు, దివ్యాంగులకు రూ.500 ఉన్న పింఛన్‌ను రూ.3016కు పెంచారు.