Radha Ravi | సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల తన కుమార్తె అవంతిక వివాహాన్ని గోవాలో అత్యంత వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, త్రిష, తమన్నా తదితర ప్రముఖుల హాజరుతో ఈ వివాహం సోషల్ మీడియాలోనూ విపరీతమైన చర్చకు దారితీసింది. అయితే, ఈ వివాహ వేడుక ముగిసిన తర్వాత ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సీనియర్ నటుడు రాధా రవి తనను ఈ వేడుకకు ఆహ్వానించలేదంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖుష్బూ, ఆమె భర్త సుందర్.సితో తనకు దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ ఆహ్వానం రాకపోవడం తనను బాధించిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధా రవిని, “ఖుష్బూ కుమార్తె పెళ్లిలో మీరు ఎందుకు కనిపించలేదు?” అని ప్రశ్నించగా ఆయన స్పష్టంగా స్పందించారు. ఆ పెళ్లికి నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. పిలవని పేరంటానికి వెళ్లడం నా అలవాటు కాదు. ఖుష్బూ పిలవకపోయినా, కనీసం ఆమె భర్త సుందర్.సి అయినా నన్ను గుర్తు చేసుకుని ఆహ్వానిస్తారని భావించాను. కానీ ఆయన నుంచి కూడా ఎలాంటి పిలుపు రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా మా కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను అని రాధా రవి తెలిపారు. రాధా రవి తన వ్యాఖ్యల్లో రాజకీయ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. గతంలో సుందర్.సి ఎన్నికల బరిలో నిలిచిన సమయంలో తాను పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చానని గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో నా వంతు సహాయం చేశాను. ఆయన విజయం కోసం ప్రచారం కూడా చేశాను. కానీ ఇప్పుడు బహుశా నా అవసరం తీరిపోయి ఉండొచ్చు. అందుకే నన్ను గుర్తు పెట్టుకోలేదేమో. ఒకవేళ ఆహ్వానించి ఉంటే నేను తప్పకుండా వెళ్లేవాడిని” అంటూ కొంత వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. రాధా రవి, ఖుష్బూ మధ్య అనుబంధం కేవలం వ్యక్తిగతంగా మాత్రమే కాదు, వృత్తిపరంగానూ ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఖుష్బూ హీరోయిన్గా నటించిన ‘చిన్న తంబి’, ‘అన్నామలై’, ‘మన్నన్’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో రాధా రవి కీలక పాత్రలు పోషించారు. రాధా రవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకాలం సన్నిహితంగా ఉన్న వ్యక్తిని కుటుంబ వేడుకకు ఆహ్వానించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది పూర్తిగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయమని అభిప్రాయపడుతుండగా, మరికొందరు రాధా రవి ఆవేదనలోనూ వాస్తవం ఉందని అంటున్నారు.