లక్నో, ఫిబ్రవరి 17: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో రోడ్లు సరిగ్గా లేక తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను బడులకు పంపాలంటేనే జంకుతున్నారు. మత్వార్ న్యాయ్ మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బడి 8వ తరగతి వరకే ఉంది. ఆ పైన చదవాలంటే 22 కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడికి వెళ్లడానికి మంచి రోడ్డు లేదు. పైగా ఆ మట్టి రోడ్డు అడవి మధ్యలో నుంచి ఉంది. రాకపోకలు చాలా తక్కువ. రోడ్డు చుట్టుపక్కల నేరాలు ఎక్కువ. ఈ భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపడం లేదు. ధైర్యం చేసి పంపినా ఉదయం 9 గంటలకు వెళ్లిన పిల్లలు ఇంటికి రావడానికి రాత్రి 9 గంటలు అవుతుంది. పిల్లలను తీసుకొచ్చే వాహనాలు బురదలో చిక్కుకుపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. దీంతో ఆ మండల ప్రజలంతా ఒక్కటయ్యారు. రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని, లేకపోతే ఈ ఎన్నికల్లో ఓటు వేయబోమని తెగేసి చెప్తున్నారు.