దేవరుప్పుల, జూన్ 20 : తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతాంగం అష్టకష్టాలు పడుతున్నదని అన్నారు. సాగునీరు అందక, పండిన పంట కొనక, ఎరువులు దొరక్క, రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఆగమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలకులు దోచుకొనుడు, దాచుకొనుడు పాలసీతో ముందుకు సాగుతున్నారని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే తాను ఇచ్చానని రేవంత్ చెప్పుకొంటున్నారని, ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. కేసీఆర్ పథకాలన్నీ అటకెక్కాయని, కనీసం రైతుబీమాకు డబ్బులు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు సత్యం, యాదగిరి, శశి అవిరినేని, అభిషేక్ రంగినేని పాల్గొన్నారు.