న్యూఢిల్లీ, జూన్ 20: వ్యాలెట్ ఇన్‌యాక్టివ్ చార్జీలపై యూజర్ల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫోన్‌పే స్పందించింది. ప్రీపెయిడ్ వ్యాలెట్లకే ఈ చార్జీలు వర్తిస్థాయి తప్ప.. లింక్ అయిన బ్యాంక్ ఖాతా, యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టంచేసింది. రెగ్యులర్ లావాదేవీలు కొనసాగించవచ్చని సూచించింది.
ఏడాదిపాటు ఎలాంటి డిజిటల్ చెల్లింపులు చేయని ఫోన్‌పే వ్యాలెట్లపై మాత్రమే చార్జీలు వసూలు చేస్తామని యూజర్లకు ఫోన్‌పే సందేశాలు పంపించింది. వీటిని ఇన్‌యాక్టివ్ వ్యాలెట్‌గా పరిగణించి, చార్జీల పేరిట మూడు నెలలకుగాను రూ.100 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. అయితే వ్యాలెట్‌లో సరిపడినంత బ్యాలెన్స్ లేకుంటే చార్జీలను బ్యాంక్ ఖాతా నుంచి వసూలు చేసున్నట్టు స్పష్టంచేసింది. యూజర్లందరికి ఇన్‌యాక్టివ్ అలర్ట్‌లు వస్తున్నా కేవలం ప్రీపెయిడ్ వ్యాలెట్‌కు ఇది వర్తిస్తున్నదని పేర్కొంది. బ్యాంక్ ఖాతా, యూపీఐ లావాదేవీలు, క్యాష్‌బ్యాక్ రివార్డులపై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టంచేసింది.