వికారాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో స్పీకర్, ముఖ్యమంత్రి సోదరుడి మధ్య వివాదం నడుస్తున్నదా? బ్రదర్ పెత్తనంపై స్పీకర్ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారా? జోక్యం చేసుకోవద్దని స్వయంగా సీఎం చెప్పినా ఆయన సోదరుడు వినడం లేదా? అందుకే సోదరుడిని పరోక్షంగా దెబ్బతీసేందుకు సీఎం పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న చర్చ ఇది. దీనికి కాంగ్రెస్ వర్గాలు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రెండేండ్లుగా వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే తరహాలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. జిల్లా అంతటా తాను చెప్పిందే వేదం అనేలా నడిపించారని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి.
కొడంగల్ నియోజకవర్గంతోపాటు వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లో ఆయన హవా కొనసాగింది. నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి పైరవీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, అన్ని శాఖల, అన్ని స్థాయిల అధికారుల పోస్టింగ్‌లు ‘బ్రదర్’ కనుసన్నల్లోనే సాగాయని చెప్తున్నారు. ఆయన అనుమతి లేనిదే కలెక్టర్ కూడా ఏ నిర్ణయం తీసుకోలేరనేలా పెత్తనం చెలాయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే అన్ని పనులూ జరిగిపోయాయని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ప్రజలు తమను ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే, కనీసం సర్పంచ్‌గా కూడా గెలువని వ్యక్తి పెత్తనం చెలాయించడంపై ఎమ్మెల్యేలు మొదటినుంచీ సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. రెండేండ్లుగా నామమాత్రంగా ఎమ్మెల్యే పదవుల్లో కొనసాగుతున్నామని గోడు వెల్లబోసుకున్నట్టు చెప్పుకొంటున్నారు.
వికారాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సోదరుడి పెత్తనం పెరిగిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్పటినుంచి నియోజకవర్గంలో ‘స్పీకర్ వర్సెస్ సీఎం బ్రదర్’ వివాదం నడుస్తున్నదని చెప్తున్నారు. మొదటినుంచీ జిల్లాలో తలనొప్పిగా మారిన సోదరుడి వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది.
తన నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించడం, పలు భూముల కబ్జాల విషయంలో బ్రదర్స్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గుర్రుగా ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. ఇదే సమయంలో తన సన్నిహితుడైన గడ్డం ప్రసాద్‌కుమార్ నియోజకవర్గమైన వికారాబాద్లోనూ జోక్యం పెరిగిపోవడం, ఈ మేరకు స్పీకర్ నుంచి ఫిర్యాదు రావడంతో సీఎం చర్యలు తీసుకున్నట్టు చెప్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని, ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చవద్దని స్పష్టంగా ఆదేశించినట్టు సమాచారం.
సీఎం స్వయంగా చెప్పినా బ్రదర్ లెక్కచేయలేదని తెలుస్తున్నది. కొడంగల్‌తోపాటు అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ తన పెత్తనం కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. భూ దందాలు, పైరవీలు, సెటిల్మెంట్లు ఆపడం లేదన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సీఎం సీరియస్ అయ్యారని, నేరుగా కాకుండా పరోక్షంగా ప్రాధాన్యాన్ని తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సోదరుడికి జీ హుజూర్ అనేలా వ్యవహరిస్తున్న అధికారులను బదిలీ చేసేందుకు కార్యాచరణ మొదలైనట్టు సమాచారం. జిల్లా స్థాయి మొదలు మండల స్థాయి వరకు పలువురు అధికారులపై వేటు ఖాయమని ప్రచారం జరుగుతున్నది.