హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ జీహెచ్ఎంసీ పరిధిలో ఏసీ బస్‌పాస్ చార్జీలను తగ్గించింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ బస్ పాస్ ధరను రూ.2530 నుంచి రూ.1900కు తగ్గించింది. సికింద్రాబాద్-పటాన్చెరు (219 రూట్), బాచుపల్లి -వేవ్‌రాక్ (195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ తగ్గింపు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. ఎయిర్పోర్ట్ మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లదని స్పష్టంచేసింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని తెలిపింది. ఆర్టీసీ బస్‌పాస్ కేంద్రాల్లో వీటిని జారీ చేయనున్నట్టు వెల్లడించింది.