పీర్జాదిగూడ, మే 3: బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న డీజే వాహనం బ్రేకులు ఫెయిలై ర్యాలీలో ఉన్న జనాలపైకి రావడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో బోడుప్పల్ కార్పొరేషన్ దేవేందర్‌నగర్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో పాటల కోసం ఏర్పాటు చేసిన డీజే వాహనం బ్రేకులు ఫెయిలై అదుపుతప్పి ర్యాలీపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఉప్పల్ కళ్యాణ్‌పురికి చెందిన శ్రవణ్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన దవాఖానకు తరలించారు.