సీనియర్ దర్శకుడు తాతినేని రామారావు మంగళవారం అర్థరాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యలతో శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 ఏండ్లు. రామారావు మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ వార్త విన్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాలు తెలియజేశారు.
సోదరుడి సహకారంతో..
కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో పుట్టిన రామారావు చిన్నతనం నుంచే సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు.సోదరుడు తాతినేని ప్రకాశ్‌రావు దర్శకుడిగా కొనసాగుతుండటంతో ఆయన సహకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రకాశ్‌రావు దగ్గరే సహాయ దర్శకుడిగా చేరి పలు చిత్రాలకు పనిచేశారు. సహాయ దర్శకుడిగా ఆయన ప్రతిభ చూసిన అక్కినేని తన సినిమాకు అవకాశం ఇచ్చారు. అలా ఏఎన్నార్, సావిత్రి జంటగా ‘నవరాత్రి’ చిత్రంతో దర్శకుడిగా మారారు తాతినేని రామారావు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పరిశ్రమలో వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగుతో పాటు హిందీలోనూ..
తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ విరివిగా సినిమాలు రూపొందించారు తాతినేని రామారావు. 1960 నుంచి 2000 దాకా దాదాపు నాలుగు దశాబ్దాలు దర్శకుడిగా కొనసాగిన ఆయన.. తెలుగు, హిందీ భాషల్లో సుమారు 70 సినిమాలు తెరకెక్కించారు. వీటిలో ‘బ్రహ్మచారి’,‘మంచి మిత్రులు’, ‘జీవన తరంగాలు’,‘ముగ్గురు మొనగాళ్లు’,‘ఇల్లాలు’,‘యమగోల’,‘పచ్చని కాపురం’, ‘తల్లిదండ్రులు’,‘గోల్మాల్ గోవిందం’ లాంటి చిత్రాలున్నాయి. హిందీలో ‘జుదాయి’, ‘నసీబ్ అప్నా అప్నా’,‘అంధా కానూన్’, ‘ఇంక్విలాబ్’,‘సన్సార్’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. తాతినేని రామారావు మృతి పట్ల తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలోని పలువురు సంతాపాన్ని తెలియజేశారు. అనుపమ్ ఖేర్, రవీనాటాండన్ వంటి బాలీవుడ్ తారలు తాతినేని దర్శకత్వ ప్రతిభను స్మరించుకున్నారు.