The Girlfriend | నేషనల్ అవార్డు గ్రహీత, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాలో రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత దీనిని కల్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ తో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా దర్శకుడు రాహుల్ స్పందించాడు. అర్జున్ రెడ్డి చిత్రానికి ఈ గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పోలికలు లేవని తెలిపాడు.
”అర్జున్ రెడ్డి ఒక కల్ట్ సినిమా. అది సినీ పరిశ్రమకు ఒక గేమ్ ఛేంజర్. నా సినిమా దానికి దగ్గరగా కూడా లేదు. ఇది ఒక చిన్న చిత్రం. నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో పోలికలు వచ్చేవరకు నాక్కూడా ఆ ఆలోచన రాలేదు. మేము కావాలనే ట్రైలర్‌ను నాన్-లీనియర్ పద్ధతిలో కట్ చేశాము. బహుశా ఆ ఎడిటింగ్ స్టైల్ వల్లే కొంతమందికి ‘అర్జున్ రెడ్డి’ వైబ్ వచ్చి ఉండవచ్చు. కానీ మా సినిమా పూర్తిగా వేరు” అని రాహుల్ రవీంద్రన్ స్పష్టం చేశారు. గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తుండగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.