‘నా తొలి సినిమా‘జాతిరత్నాలు’తో పోలిస్తే ‘ఫంకీ’ పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ సినిమా. అలాగే ఇందులో ఎమోషన్స్ కూడా ఉంటాయి. సినీదర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనల్ని సామాన్య ప్రేక్షకునికి కూ డా అర్థమయ్యేలా ఇందులో చూపించడం జరిగింది. ప్రేక్షకులు కనెక్టయ్యే అన్ని ఎలిమెంట్సూ ఈ సినిమాలో ఉంటాయి’ అని దర్శకుడు కె.వి.అనుదీప్ అన్నారు. ఆయన దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’. కయాదు లోహర్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ నెల 13న ప్రేమికుల దినోత్సవ కానుకగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో దర్శకుడు అనుదీప్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో విశ్వక్సేన్ సినీ దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ కథ రాస్తున్నప్పుడే ఈ పాత్రలో విశ్వక్‌ను చూశాను. ‘ఫంకీ’ అనే టైటిల్ హీరో పాత్రకు సరిగ్గా సరిపోతుంది. పైగా ఈ తరం అభిరుచికి తగ్గట్టుగా, క్యాచీగా ఉంది కాబట్టే ఈ సినిమాకు ‘ఫంకీ’ అని పేరు పెట్టాం. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు సహజంగా ఉంటాయి.
నేను కూడా ఇందులో ఓ అతిథి పాత్ర చేశాను. అలాగే దర్శకులు హరీశ్‌శంకర్, కళ్యాణ్శంకర్, నిర్మాతలు దిల్‌రాజు, నాగవంశీ కూడా అతిథులుగా కనిపిస్తారు. ఈ పాత్రలన్నీ కథలో భాగంగానే వస్తాయి. ఇటీవలే త్రివిక్రమ్ ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు’ అని తెలిపారు అనుదీప్. సీనియర్ నరేశ్ పాత్ర ఇందులో హైలైట్‌గా ఉంటుందని, భీమ్స్ సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారని, 2గంటల 5 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని అనుదీప్ చెప్పారు.