‘దండోరా’ టీమ్‌కు నేను ముందుగానే కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా. ప్రచార చిత్రాలు చూస్తుంటే చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమవుతుందనిపిస్తున్నది. సమాజంలోని బలహీనతల్ని దమ్ముతో దండోరా వేయించి మరీ చెప్పేందుకు నిజంగా గట్స్ ఉండాలి. డైరెక్టర్ మురళీకాంత్‌కి ఆ దమ్ము, ధైర్యం ఉన్నాయి. నిర్మాత రవీంద్ర బెనర్జీ సినిమాలంటే నాకెంతో ఇష్టం. ‘దండోరా’తో ఆయన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా’ అని అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఆశాభావం వ్యక్తం చేశారు.
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మానికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్య పాత్రలు పోషించిన సందేశాత్మక చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతిథిగా విచ్చేసిన అనిల్ రావిపూడి పైవిధంగా స్పందించారు.
కంటెంట్‌ని నమ్మి తీసిన సినిమా ఇదని, ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని నటి బిందుమాధవి చెప్పారు. ఇది చిన్న సినిమానే అయినా.. థియేటర్లకు జనాన్ని రప్పించేంత గొప్ప కంటెంట్ ఇందులో ఉందని దర్శకుడు మురళీకాంత్ అన్నారు. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్మాత రవీంద్ర బెనర్జీ థాంక్స్ చెప్పారు. ఇంకా నటులు శివాజీ, నవదీప్, రవికృష్ణ, మైత్రీ శశిధర్‌రెడ్డి, డీవోపీ వెంకట్ ఆర్.శాకమూరి తదితరులు మాట్లాడారు.