‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. టాలీవుడ్‌కి చెందిన దాదాపు 100మంది మహిళలు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ పేరుతో మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్(MAA) ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ఈ వ్యవహారంపై ఘాటుగా ఓ లేఖ రాశారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై ఉండి స్త్రీల వేషధారణపై అసభ్యకరంగా మాట్లాడటం చాలా తప్పని ఈ లేఖలో వారు పేర్కొన్నారు. శివాజీ మాటలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, న్యాయపరంగా ఇది శిక్షార్హమైన నేరమని ఆ లేఖలో వారు గుర్తు చేశారు. ఇలాంటి మాటలు పరిశ్రమ గౌరవాన్ని కూడా తగ్గిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
శివాజీ ఈ విషయంలో ఎలాంటి షరతులు లేకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో లీగల్‌గా ముందుకెళ్తామని వారు పేర్కొన్నారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాతలు సుప్రియ, స్వప్నదత్, నటీమణులు మంచులక్ష్మి, ఝాన్సీ వంటి సినీ ప్రముఖులు ఈ లేఖలో సంతకాలు చేశారు. ప్రముఖ గాయని చిన్మయి తన ఎక్స్ ఖాతా ద్వారా శివాజీ వ్యాఖ్యలను తప్పుపట్టగా, రీసెంట్గా ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ సైతం ఈమాటలపై తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు.
శివాజీ క్షమాపణ: ఇదిలావుంటే.. ఈ నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం సాయంత్రం నటుడు శివాజీ తన వ్యక్తిగత సాంఘిక మాధ్యమం ద్వారా పరిశ్రమ మహిళలకు క్షమాపణ తెలిపారు. తన మనసులోని భావాల్లో నిజముందని, అయితే.. కొన్ని వ్యాఖ్యలు మాత్రం నిజంగానే అభ్యంతకరంగా ఉన్నాయని, అందుకే నా వ్యాఖ్యాల వల్ల బాధపడ్డ వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని శివాజీ అన్నారు. ఇదిలా ఉం డగా, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ శివాజీకి నో టీసులు పంపించింది. ఈనెల 27 కమిషన్ కార్యాలయం ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించింది.