సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): లాపరోస్కోపిక్ ద్వారా 26 ఏండ్ల ఓ మహిళలకు నానక్‌రామ్‌గూడలోని బర్త్‌రైట్ రెయిన్ బో దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేసినట్లు వైద్యులు తెలిపారు. దవాఖాన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ మానస బద్వేలి ఈ అత్యంత క్లిషమైన శస్త్ర చికిత్సను నైపుణ్యంగా నిర్వహించారు. ఓపెన్ సర్జరీ కాకుండా అత్యాధునిక లాపరో స్కోపిక్ చికిత్స ద్వారా మహిళ గర్భాశయంలో ఉన్న సుమారు 2.7 కిలోల బరువున్న 11 కణతు(గడ్డలు)లను విజయవంతంగా తొలగించారు.
ఈ కణతులు 3 కర్బుజా పండు, మిగిలినవి బత్తాయి పండు పరిమాణంలో ఉన్నాయని వైద్యురాలు వివరించారు. వీటి కారణంగా ఆమె 8 నెలల గర్భం పరిమాణం కల్గి ఉన్నట్లు కన్పించిందని, ఈ విధమైన కేసులలో సంప్రదాయక ఓపెన్ సర్జరీ అవశ్యకత ఉన్నప్పటికీ అత్యంత నైపుణ్యతతో వైద్యురాలు మానస ఈ క్లిష్టమైన లాపరోస్కోపిక్ ప్రక్రియను విజయవంతం చేశారని, సదరు మహిళకు సంతానోత్పత్తికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని వివరించారు.
ఈ సందర్భంగా వైద్యురాలు మానస బద్వేలి మాట్లాడుతూ దీనిని ఒక సవాలుగా తీసుకున్నామని, లాపరో స్కోపిక్ ప్రక్రియ ద్వారా తక్కువ కోతతో ఎక్కువ ప్రయోజనాలు చేకురుతుందన్నారు. ఇలాంటి కణతులతో అధిక రుతు స్రావం, కటి ప్రదేశంలో నొప్పి, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయని, ఇలాంటి కేసులలో ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుందని, అయితే కొందరి విషయంలో లాపరో స్కోపిక్ ఎంతో పురోగతని ఇస్తుందని, రోగి త్వరగా కోలుకునేందుకు అవకాశాలుంటాయన్నారు. ఎంఆర్ఐ ద్వారా ముందస్తు అపరేటింగ్ ప్రణాళికలు రూపొందించి ఈ శస్త్ర చికిత్స నిర్వహించామని, ఆమె త్వరగా కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యిందని వైద్యురాలు మానస వివరించారు. ఇలాంటి ప్రక్రియ వలన రోగికి తక్కువ ఇబ్బంది ఉంటుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉండవని, రక్తస్రావం, అనారోగ్యం వంటి వాటికి అస్కారం ఉండదని వైద్యురాలు తెలిపారు.