హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలశాఖలో ఇద్దరు ప్రత్యేక ముఖ్యకార్యదర్శుల మధ్య మొదలైన ప్రచ్ఛన్న యుద్ధం పరిధి దాటి ప్రత్యక్ష పోరుకు చేరింది. హెచ్వోడీలు, కార్యదర్శులు కచ్చితంగా ఎన్ఐసీ ఇచ్చిన ఈ-మెయిల్‌ను మాత్రమే వాడాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ఏకంగా సర్యులర్ జారీచేశారు. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా సీఎంవోలోని సీనియర్ ఐఏఎస్ అధికారి మెయిల్స్ ఓపెన్ చేసి చూసి తనకు పంపటంపై విసుగుచెందిన సదరు ప్రత్యేక ప్రధానకార్యదర్శి తొలుత సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయినా సీనియర్ అధికారి పద్ధతి మారకపోవటంతో నవంబర్ 11న జారీచేసిన సర్యులర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని ప్రభుత్వ విభాగాల హెచ్వోడీలు, కార్యదర్శులు కచ్చితంగా ఎన్ఐసీ ఇచ్చిన ఈ-మెయిల్‌ను మాత్రమే వాడాలని, అవసరమైతే కొత్త ఈ-మెయిల్ కోసం తెలంగాణ స్టేట్ ఈ-మెయిల్ యూనిట్‌ను సంప్రదించాలని, అధికారిక పనుల కోసం స్వంత ఈ-మెయిల్ వాడటాన్ని నిలిపివేయాలని సర్క్యులర్‌లో స్పష్టంచేశారు. వాస్తవానికి ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. కానీ పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజయ్‌కుమార్ కొత్తగా అదే విషయమై సర్యులర్ జారీచేయటం సచివాలయంలో చర్చనీయాంశమైంది.
పరిశ్రమల శాఖలో ద్వితీయ శ్రేణి అధికారుల మధ్య జరుగుతున్న చర్చ ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే పనికి ఇద్దరు అధికారులను నియమించింది. కానీ ఎవరు ఏ పనిచేయాలో స్పష్టతనివ్వకపోవడం వివాదానికి కారణమైంది. ముఖ్యకార్యదర్శి ఆధీనంలో పాలసీ రూపొందించటం, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపునకు సంబంధించిన టీజీఐఐసీ, పరిశ్రమల కార్యకలాపాలు ఉంటాయి. వీటి నిర్వహణలో మంత్రి తరువాత ముఖ్యకార్యదర్శి జవాబుదారీగా ఉంటారు. ఆయనకే ఆయా పనుల మీద సర్వాధికారాలు ఉంటాయి. కానీ ఈ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరు అధికారులను నియమించి ఇద్దరికీ బాధ్యతలు అప్పగించారు. ఇద్దరూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న అధికారులే కావటంతో ఒకరిని సీఎం కార్యాలయంలో, మరొకరిని పరిశ్రమలశాఖ కార్యాలయంలో నియమించారు. ఇక్కడే ఇద్దరు ముఖ్యకార్యదర్శుల మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్టు సమాచారం. సీఎంవోలోని ప్రత్యేక ముఖ్యకార్యదర్శి పరిశ్రమల శాఖ మీద కర్రపెత్తనం చేయాలని చూస్తున్నట్టు, దీన్ని అక్కడి అసలు ముఖ్యకార్యదర్శి వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.
సీఎంవోలో ఉన్న అధికారి ఐదేండ్ల్లుగా పరిశ్రమల శాఖలోనే పనిచేస్తుండటం, సీఎంతో ఉన్న సాన్నిహిత్యం తదితర వెసులుబాట్లతో కీలకమైన మెయిల్స్‌ను ఆయనే రిసీవ్ చేసుకుంటున్నట్టు తెలిసింది. ముందుగా ఆయన చూసిన తర్వాత పరిశ్రమల శాఖలోని ముఖ్యకార్యదర్శికి ఫార్వర్డ్ చేస్తున్నారు. దీనిని సద రు ముఖ్యకార్యదర్శి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిజినెస్ రూల్‌బుక్ ప్రకారం తనకే నేరుగా మెయిల్ రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇటీవల ఇదే పరిశ్రమలశాఖ నుంచి హిల్ట్ పాలసీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడకముందే పలు కీలక డాక్యుమెంట్లు బయటికి వెళ్లి కలకలం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన సీఎం రేవంత్‌రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన అంతర్గత సర్క్యులర్ మరోసారి బయటికి రావటం మళ్లీ చర్చనీయాంశమైంది.