బెంగళూరు, మే 23: దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. సీబీఐ, ఈడీ అధికారులుగా నటిస్తూ.. సైబర్ నేరగాళ్లు బెంగళూరుకు చెందిన 74 ఏండ్ల వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేశారు. ఆమె బ్యాంక్ ఖాతాల్లోని 24 కోట్ల రూపాయలను దశల వారీగా తమ ఖాతాల్లో తరలించుకున్నారు. ఈ భారీ సైబర్ మోసానికి పాల్పడ్డ నేరగాళ్ల నెట్వర్క్ను బెంగళూరులోని సైబర్ కమాండ్ యూనిట్ ఛేదించింది.
బెంగళూరుకు చెందిన సీనియర్ సిటిజన్ లక్ష్మీ రామమూర్తిని సైబర్ మోసగాళ్లు మానసికంగా ఉచ్చులో పడేశారని, ఆమె ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తంలో డబ్బులు బదిలీ చేసేలా ఒత్తిడి చేశారని పోలీసులు తెలిపారు. మనీలాండరింగ్ చేసిన నేరగాళ్ల ‘మ్యూల్ ఖాతాల’ను గుర్తించామని అన్నారు. దోచుకున్న రూ.4 కోట్లకుపైగా సొమ్ము స్తంభింపజేశామని, మరో రూ.1.46 కోట్లు రికవరీ చేశామని పోలీసులు చెప్పారు. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.