రక్తంలోని చక్కెరల స్థాయి ప్రతిరోజూ తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు, ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ అదుపు తప్పుతుంది. ఇది ఇతర ఇబ్బందులకు దారితీస్తుంది. ఇలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా భోజనం తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ చేరుతుంది. ఈ గ్లూకోజ్ అధిక స్థాయిలో ఉండకుండా.. తిన్న తర్వాత రెండు నుంచి అయిదు నిమిషాలపాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు నడవడం వల్ల అప్పటికే రక్తంలో ఉన్న కొంత గ్లూకోజ్ ఖర్చయిపోతుంది. కాబట్టి రక్తంలో అసాధారణ స్థాయిలో గ్లూకోజ్ చేరదు. ఇది ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లే కాదు ఆరోగ్యవంతులు కూడా పాటించాల్సిన నియమం.
ఇక డయాబెటిస్, బ్లడ్‌షుగర్ అధికంగా ఉండేవాళ్లు వ్యాయామాలు కచ్చితంగా చేయాల్సిందే. వ్యాయమానికి, రక్తంలో చక్కెర స్థాయి, ఇన్సులిన్స్ నిరోధకతకు ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు అధ్యయనం చేసిన పరిశోధకులు ఒక ఆసక్తికరమైన మార్పుని గుర్తించారు. ఉదయం వ్యాయామం చేసినవాళ్లలో కంటే మధ్యాహ్నం, సాయంత్రం వ్యాయామం చేసినవాళ్లలో ఇన్సులిన్ రెసిస్టెంట్ సమస్య తగ్గినట్టుగా గుర్తించారు. ఉదయం చేసిన వ్యాయామం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం, సాయంత్రం చేసేవి మరింత ప్రభావం చూపుతాయి. ఇలా రక్తంలో చక్కెర నియంత్రణ కోసం సాధారణ వ్యాయామాలు ఎంచుకున్నవాళ్లు వారంలో 150 నుంచి 300 నిమిషాలు వ్యాయామం చేయాలని, కష్టతరమైన వర్కవుట్స్ చేసేవాళ్లు వారంలో 75 నుంచి 150 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగైన స్థితిలో ఉంచుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.