ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం నర్సన్న దక్షిణ దిగ్యాత్ర కనుల పండువలా సాగింది. స్వామివారు పోలీస్‌స్టేషన్‌లో పూజలందుకున్నారు. స్వామివారు దక్షిణంవైపు విహారయాత్రకు బయలుదేరే కార్యక్రమాన్ని దక్షిణ దిగ్యాత్రగా చెబుతుంటారు. ఈ దిగ్యాత్రలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి (యోగ, ఉగ్ర) వారల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వెలుపలకు తీసుకువచ్చి.. సేవలపై వేంచేపు చేసి కళాకారుల ప్రదర్శనలతో సాయంత్రం దక్షిణ దిశలోని పోలీస్ స్టేషన్ వైపుగా తోడుకొని వచ్చారు. దారి పొడవునా పోలీసు సిబ్బందితో పాటు భక్తులు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు ప్రకాశ్, రవీందర్‌రెడ్డి, ఎస్బీ సీఐ రాజశేఖర్రావ్, ధర్మపురి సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్ఐలు కిరణ్‌కుమార్, రామకృష్ణ, నరేశ్, దత్తాత్రి, పోలీస్ సిబ్బంది స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం పోలీస్‌స్టేషన్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, స్వామివారల ఎదుట ఆయుధాలను ఉంచి వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, వేదపండితులు బొజ్జ రమేశ్, దేవస్థానం సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, దేవస్థానం రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, ఇనుగంటి రమావేంకటేశ్వరరావ్, గందె పద్మశ్రీనివాస్, గునిశెట్టి రవీందర్, వేముల నరేశ్, చుక్క రవి, పల్లెర్ల సురేందర్, వీరవేని కొమురయ్య, గుంపుల రమేశ్, జైన రాజమౌళి, సురేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్‌కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ పండితులు, వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య మధ్యాహ్నం వేళలో స్వామివారల ఉత్సవ మూర్తిని సేవలపై ఉంచారు. బ్రహ్మపుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకవచ్చి పుష్కరిణి నీటిలో హంసవాహనంపై ఉంచి స్వామివారల సేవలను ఐదుసార్లు ప్రదక్షిణలు చేయించి తెప్పోత్సవం జరిపారు. స్వామివారి హంసవాహనాన్ని అనుసరిస్తూ భక్తులు కూడా ప్రదక్షిణలు చేస్తూ గోవింద నామస్మరణతో కుంకుమ, బుకాగుల్లాలు చల్లి మొక్కులు చెల్లించారు. అనంతరం బ్రహ్మపుష్కరిణి మధ్యలో ఉన్న ఊయలపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఘనంగా డోలోత్సవం జరిపారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్య, ముఖ్య అర్చకులు, అర్చకులు తదితర బ్రాహ్మణులు రాత్రి వరకూ ఉత్సవాన్ని కొనసాగించారు. భక్తులు క్యూలైన్లో స్వామివారిని దర్శించుకున్నారు.
ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజైన గురువారం ఉత్సవాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ధర్మపురిలో భక్తజన సందడి నెలకొన్నది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు మొదట గోదావరి నదిలో పుణ్యస్నానాలాచరించి ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో క్యూలైన్ల ద్వారా స్వామివారలను దర్శించుకున్నారు .యాజ్ఞాచార్యులు వామానాచార్యుల ఆధ్వర్యంలో ఆస్థాన సామ వేదపండితులు ముత్యాల శర్మ, వేదబ్రాహ్మణులు మంత్రోచ్చరణల మద్య హోమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని బ్రాహ్మణ సంఘ భవనంలో ఆలయం పక్షాన రైస్‌మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు.
కార్యక్రమంలో దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు పట్టణంలోని వివిద పాఠశాలల విద్యార్థులు, ఆర్యవైశ్య మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవలందించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవాయంలోని శేషప్ప కళావేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు గోదావరిఖనికి చెందిన రవీందర్చే సంగీత కచేరి నిర్వహించారు. అనంతరం మంగళంపల్లి స్వర్ణలత శాస్త్రీయ సంగీతం ఆకట్టుకున్నది. రాత్రి 9గంటల నుంచి 12గంటల వరకు శ్రీలక్ష్మీనరసింహ నాట్యమండలి వారిచే దక్షయజ్ఙం పౌరాణిక నాటకం చూపరులను కట్టిపడేసింది. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు ఉత్తర దిగ్యాత్ర, రాత్రి భోగమండప ఉత్సవం, వేద సదస్సు నిర్వహించనున్నారు.