రామగిరి, మార్చి 26 : ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాటాలు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, అమరజీవి బొమ్మగాని ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని సిపిఐ నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్ కుమార్ అన్నారు. బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయం మగ్దూమ్ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నాటి నిజాం పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ధర్మభిక్షం పాత్ర ఎంతో విశిష్టమని గుర్తు చేశారు. గ్రామీణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలకు ఎదురు నిలిచి, భూమి, జీవనోపాధి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
నల్లగొండ జిల్లాలో కరువు సమస్యలు, ఫ్లోరైడ్ ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సాగు, తాగునీటి సమస్యలపై అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వాలను కదిలించారని తెలిపారు. ప్రజల సమస్యలపై రాజీ పడని ధోరణి, సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటం ధర్మభిక్షాన్ని నిజమైన ప్రజానాయకుడిగా నిలబెట్టిందన్నారు. గీత పనివారాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా గీత వృత్తిదారుల హక్కుల కోసం ధర్మభిక్షం చేసిన పోరాట ఫలితంగానే నేడు ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలు సక్రమంగా అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారవుతామన్నారు.
అదేవిధంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యునిగా సేవలందించిన ధర్మభిక్షం పేరు సూర్యాపేట జిల్లాకు పెట్టడంతో పాటు, ఆయన జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు దీటి నరసయ్య, శాంతి సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా యాదయ్య, సిపిఐ నల్లగొండ పట్టణ సహాయ కార్యదర్శి వి.లెనిన్, నాయకులు ముండ్ల ముత్యాలు,యూసుఫ్, కౌంసల్య, టి.దశరథ, వెంకటేశ్, నాగమణి, సైదమ్మ పాల్గొన్నారు.