BomanIrani | బాలీవుడ్ విలక్షణ నటుడు బోమన్ ఇరానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తనదైన శైలిలో వేసిన సెటైర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో “ఇరానియన్లతో” చర్చలు జరుపుతానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బోమన్ ఇరానీ తన ఇంటి పేరుతో ముడిపెడుతూ సరదాగా స్పందించాడు. ట్రంప్ ఇరాన్ దేశస్థుల గురించి మాట్లాడుతుంటే, బోమన్ ఇరానీ దాన్ని తన ఇంటి పేరుగా మార్చేసి, ఈ శాంతి చర్చలకు తనతో పాటు నటి అరుణా ఇరానీ, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా సిద్ధంగా ఉన్నారని చమత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము శాంతి కోసం దేనికైనా సిద్ధమని, అయితే తాను వాషింగ్టన్ వరకు రాలేనని బోమన్ పేర్కొన్నాడు. ట్రంప్ తన బృందంతో ముంబైలోని దాదర్ పార్సీ కాలనీకి వస్తే బాగుంటుందని, అక్కడ ఆయనకు రుచికరమైన పార్సీ వంటకాలైన ధన్సాక్, కస్టర్డ్ తినిపిస్తామని ఆహ్వానించారు. అయితే ఈ విందు కోసం వచ్చేటప్పుడు ట్రంప్ తనతో పాటు ఒక “గ్యాస్ సిలిండర్” తీసుకురావాలని, అప్పుడు తమ పని ఇంకా సులభం అవుతుందని దేశంలోని గ్యాస్ ధరలపై సున్నితమైన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ రాజకీయ అంశాన్ని భారతీయ సందర్భానికి అనుగుణంగా మార్చి బోమన్ చేసిన ఈ పోస్ట్‌కు ఫర్హాన్ అక్తర్, జావేద్ జాఫ్రీ వంటి సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.