హైదరాబాద్ : మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు(Medaram jatara) భక్తులు పోటెత్తారు. వరుస సంక్రాంతి సెలవులు రావడంతో మేడారానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అమ్మ వార్లకు ముందుస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో ఇరువైపులా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది. భారీగా భక్తులు తరలి వస్తుండటంతో పస్రా- మేడారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నయ్యారు. కాగా, ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు మేడారాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై సమీక్షనుంచనున్నారు.