న్యూఢిల్లీ : క్యాన్సర్ చికిత్సకు (Cancer) సంబంధించిన అభివృద్ధి ఎంత జరుగుతున్నప్పటికీ, ఏటా లక్షలాది కొత్త కేసులు నమోదవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఓ సార్వజనీన వ్యూహం కోసం ప్రయత్నిస్తున్నారు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం భరోసానిచ్చే అవకాశం కనిపిస్తున్నది. పరిశోధకులు డాక్టర్ ఎలియాస్ సాయౌర్, డాక్టర్ డువానే మిషెల్ నిర్వహించిన అధ్యయనంలో, ఒక కణితి రకాన్ని లక్ష్యంగా చేసుకోకుండా మెసెంజర్ ఆర్ఎన్ఏ (MRNA)ను ఏ విధంగా నియంత్రించాలో తెలుసుకున్నారు. ఇది ఒరిజినల్ ట్యూమర్ సైట్‌కు అతీతంగా విస్తరిస్తుంది. ఎలుకలపై చేసిన ప్రయోగాలను బట్టి రోగ నిరోధక వ్యవస్థ కొత్త ట్యూమర్ స్పెసిఫిక్ మార్కర్స్‌ను చికిత్స కొనసాగుతున్న కొద్దీ సమగ్రంగా గుర్తించడం నేర్చుకున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ విధంగా యాంటీజెన్ రికగ్నిషన్ వ్యాపించడం దీర్ఘకాలంలో క్యాన్సర్ నియంత్రణకు చాలా ముఖ్యం.
కణుతులు చికిత్సను నిరోధించడానికి జన్యుపరమైన పరివర్తనలు ఒకటే కారణం కాదని, లోపించిన డ్యామేజ్-రెస్పాన్స్ సిగ్నల్‌కు కూడా సంబంధం ఉంటుందని వెల్లడైంది. దీనిని ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ పునరుద్ధరించగలదని తెలిసింది. ప్రారంభంలో కణాల నుంచి ప్రొటీన్లు విడుదలయ్యే ఇంటర్ఫెరాన్ చర్యలను పునరుద్ధరించడం ద్వారా, రోగనిరోధక చెక్‌పాయింట్ డ్రగ్స్ అంతకుముందు పైకి కనిపించకుండా దాక్కున్న క్యాన్సర్ సెల్స్‌ను చూసి, దాడి చేయడంలో మెరుగ్గా పని చేస్తాయి. ప్రతి రకం క్యాన్సర్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ను డిజైన్ చేయవలసిన అవసరం లేకుండా అన్నీ క్యాన్సర్లకు ఉపయోగపడే విధంగా జనరలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ ఫార్ములేషన్‌ను స్టాండర్డ్ ఇమ్యునోథెరపీస్కు జోడించవచ్చునని పరిశోధకులు చెప్పారు.