బాలి: ఇండోనేషియా మాస్టర్స్ సూపర్-750లో భారత పోరు ముగిసింది. వరుస విజయాలతో దూకుడు మీద కనిపించిన స్టార్ షట్లర్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌కు నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ సింధు 13-21 9-21తో టాప్ సీడ్ అకానే యమగుచి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 32 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో సింధు తొలుత ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఒకానొక దశలో 12-7తో పైచేయి సాధించిన సింధు అదే జోరు కొనసాగించలేకపోయింది. యమగుచి అనూహ్యంగా పుంజుకుని పోటీలోకి రావడంతో ఫలితం తారుమారైంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్ 14-21 9-21తో ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్ ఆరంభంలో దీటైన పోటీనిచ్చిన శ్రీకాంత్ అనంతరం వెనకబడ్డాడు. రెండో గేమ్‌లో కూడా తడబడ్డ శ్రీకాంత్ ఆఖరి వరకు పోటీనివ్వలేక మ్యాచ్ చేజార్చుకున్నాడు.